AP JAC AMARAVATI MEETING UPDATES: దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓపికతో ఉన్నారని.. ఇక ఆ ఓపిక నశించి ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందని.. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యమ కార్యచరణలో భాగంగా ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి నెలాఖరి వరకు వివిధ రూపాలలో ప్రభుత్వానికి నిరసన కార్యక్రమాలను తెలియజేస్తున్నామన్నారు. కడప వైఎస్సార్ ఆడిటోరియంలో నేడు ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల, ఔట్ స్కోరింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి 'ముందడుగు పేరిట' సభను నిర్వహించి.. ఉద్యమ కార్యాచరణ వివరాలను వెల్లడించారు.
ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..''ఉద్యమం ప్రారంభమైన రోజు నుంచి కలెక్టర్లను కలిసి వినతి పత్రాల అందజేస్తాం. అప్పటికి ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకుంటే ఏప్రిల్ 5వ తేదీ నుంచి మలిదశ ఉద్యమం ఎలా చేయాలి అనే దాని గురించి వెల్లడిస్తాం. 11వ పీఆర్సీ బకాయిలు ఇప్పటివరకు చెల్లించ లేదు. చనిపోయిన కార్మికుల, ఉద్యోగుల, పిల్లలకు సంబంధిత శాఖలు ఉద్యోగాలు ఇవ్వకుండా గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వడం దారుణం. ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద ఉద్యోగుల పిల్లలకు మాత్రం కలెక్టరేట్లలో, రెవెన్యూ విభాగంలో ఉద్యోగాలు ఇవ్వడం సరైనది కాదు. తమ పిల్లలకు ఓ న్యాయం ఉన్నతాధికారుల పిల్లలకు మరో న్యాయమా..?'' అని ప్రశ్నించారు.
అనంతరం ఏడాదికి 250 కోట్ల రూపాయలు హెల్త్ కార్డుల కోసం ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తున్నామని, కానీ హెల్త్ కార్డులు నాలుక గీక్కోవడానికి కూడా పనికి రావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. గుండెపోటులకు హెల్త్ కార్డులు పనిచేయడం లేదని పేర్కొన్నారు. 'సీఎం జగన్ గారూ.. మా హెల్త్ కార్డులన్ని ఏమయ్యా..?, ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహించడంతోనే ఉద్యమానికి శ్రీకారం చుట్టాం' అని ఆయన హెచ్చరించారు. తమతో పాటు మిగిలిన సంఘాలు కూడా ఉద్యమానికి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని రెవెన్యూ గెస్ట్ హౌస్‌లో ఏపీ జేఏసీ అమరావతి నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద్యోగులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలిసేలా.. ఇక నుంచి పోరాటాలు చేయాలని ఏపీ జేఏసీ అమరావతి ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణ మోహన్ పిలుపునిచ్చారు. 26 జిల్లాల్లో ఏపీ జేఏసీ అమరావతి తరుపున పర్యటిస్తున్నామన్న నేతలు.. ప్రభుత్వం ఉద్యోగులకు కనీస అవసరాలను గుర్తించం లేదని మండిపడ్డారు.
ఉద్యోగులకు జీతాలను సకాలంలో ఇవ్వాలని అడుగుతుంటే ఉద్యమం చేస్తునట్లా? అని ప్రశ్నించారు. సచివాలయ ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని.. ఏపీ జేఏసీ అమరావతి విజయనగరం ఛైర్మన్ బీజీ ప్రసాద్ ప్రభుత్వంపై ఆగ్రహించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖచిత్రం ముఖ్యమా, పని ముఖ్యమా..? అని ఎద్దేవా చేశారు. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఓపీఎస్ విధానం ఎందుకు అమలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల సంక్షేమం కొరకే ఈ నెల 9వ తేదీ నుంచి నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టనున్నామని తెలిపారు.
ఇవీ చదవండి