పూర్తి పారదర్శకంగా సాగే 'ఆప్కోస్' విధానం ద్వారా.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగ వ్యవస్థలో అవినీతి, ప్రయివేటు ఏజెన్సీల దళారీలు, వేతనాల్లో కోతలకు కళ్లెం పడుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా స్పష్టంచేశారు. ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ ద్వారా కడప జిల్లాలో 84 ప్రభుత్వ శాఖల పరిధిలో 5, 103 మంది ఉపాధి పొందేందుకు అవకాశం లభించిందని తెలియజేశారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా 1,449 మంది బీసీ, మైనారిటీ కేటగిరీకి చెందినవారు, 2,354 మంది ఎస్సీ కేటగిరి, 154 మంది ఎస్టీ, 1,162 మంది ఓసీ కేటగిరికి చెందిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పూర్తి స్థాయి జీతంతో పాటు న్యాయం జరగనుందన్నారు. ఇందులో 1,473 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారన్నారు.
ఏ మాత్రం లాభాపేక్ష లేకుండా పనిచేసే ఈ కార్పొరేషన్... నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అని గుర్తు చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వీలైనంత వరకు ప్రయోజనం కలిగించడం, కోతలు లేకుండా వారి వేతనాలు పూర్తిగా చెల్లించడంతో పాటు, ఎక్కడా అవినీతి, లంచాలకు తావు లేకుండా చేయడం ఈ కార్పొరేషన్ ప్రధాన ఉదేశ్యం అన్నారు. అంతేకాకుండా.. ఆయా ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, వాటన్నింటిలో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతోందన్నారు.