All Party Meeting Against Redistribution of Krishna Waters: నీటి కేటాయింపుల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని అఖిలపక్షం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. కృష్ణా జలాల పునఃపంపిణీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కడపలో సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు హాజరయ్యారు. సాగునీటి రంగ నిపుణులు కూడా హాజరై అభిప్రాయాలను వెల్లడించారు.
CPI Allegations on YCP Government: సీఎం జగన్ ఢిల్లీలో ఉండగానే కేంద్రం కృష్ణా జలాల పున పంపిణీపై నోటిఫికేషన్ ఇచ్చిందని సీఎం ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ విధంగా నోటిఫికేషన్ ఇస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. నదీ జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదని అన్నారు. రాష్ట్రంలో 300 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. జగన్ ఇప్పుడు విశాఖ వెళ్తానని అంటున్నాడు.. సీఎం తాడేపల్లిలో ఉన్నా విశాఖలో ఉన్నా ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో వైసీపీను ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కృష్ణా బేసిన్లో నాలుగు ప్రాజెక్టులు లేని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేశారు.. కానీ జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు.
Somireddy Allegations on YCP Government: గతంలో జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో సీఎం జగన్ ఏమీ మాట్లాడక పోవడం దుర్మార్గం అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో సీఎం జగన్కు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి... కేంద్రంతో కేసుల సమస్య ఉంది అందుకే రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయలేని పరిస్తితి ఉందన్నారు.
Tulsi Reddy Allegations on YCP Government: మోదీ దుర్మార్గపు చర్యలతో.. జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్ట పోయిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి విమర్శించారు. పోలవరం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది.. ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. తెలంగాణ నాలుగు చట్ట వ్యతిరేక ప్రాజెక్టులు కట్టినా ఏపీ ప్రభుత్వం పట్టించుకొక పోవడం అన్యాయమని.. పాలమూరు, డిండి ద్వారా 150 టీఎంసీల నీటిని తరలించుకునే విధంగా తెలంగాణ నిర్మాణాలు చేస్తున్నా.. ఏపి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని విమర్శించారు. దిగువ, ఎగువనున్న ఏపీలో గాలేరు నగరి, గండికోట, వామికొండ, పైడిపాలెం, సర్వరాయ సాగర్, చిత్రావతికి నీళ్లు రావాలన్నా పై ప్రాంతాలలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల నష్టం జరుగుతుందని తులసి రెడ్డి వ్యాఖ్యానించారు.