ప్రధాన రహదారి పక్కనే ఉన్న స్థలాన్ని కాజేసేందుకు ఓ వ్యక్తి ఏకంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. తనకు ఆ భూమి కేటాయించాలని రెవెన్యూ అధికారులను కోరాడు. మంత్రి సిఫార్సు కూడా ఉందని లెటర్ ప్యాడ్‌ను వారికి అందజేశాడు. అయితే ఆ లెటర్ ప్యాడ్, అందులోని సంతకం నకిలీవని విచారణలో తేలింది.
కడప జిల్లా చిన్నమండెం మండలం కేశపురం పంచాయతీ దేవళంపేటకు చెందిన రెడ్డప్ప అనే వ్యక్తి... కడప - బెంగళూరు ప్రధాన రహదారిలోని కేశపురం చెక్‌పోస్ట్ వద్ద ఉన్న సర్వే నెంబర్ 1648లో 1.25 ఎకరాల స్థలాన్ని తనకు లీజుకు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు శనివారం వినతిపత్రం అందజేశాడు. మంత్రి తానేటి వనిత పేరుతో ఉన్న సిఫార్సు లేఖను రెవెన్యూ అధికారులకు అందజేశాడు. ఈ విషయం నియోజకవర్గ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి తెలియడం వల్ల మంత్రి సిఫార్సు లేఖలు తనకు పంపాలని ఆదేశించారు. అనంతరం సమస్య మంత్రి దృష్టికి చేరటంతో తాను లేఖ ఇవ్వలేదని... అందులోని సంతకం తనది కాదని స్పష్టం చేశారు. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేయాలని మంత్రి వనిత స్వయంగా రాష్ట్ర డీజీపీ, హోంమంత్రిలకు గురువారం ఫిర్యాదు చేశారు. ఉరుకులు, పరుగుల మీద రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఫోర్జరీ సంతకంపై ఆరా తీశారు. మంత్రి సంతకం ఫోర్జరీకి పాల్పడ్డాడని రెడ్డప్పపై చిన్నమండెం తహసీల్దార్ నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రాయచోటి గ్రామీణ సీఐ సుధాకర్ రెడ్డి, చిన్నమండెం ఎస్ఐ హేమాద్రి రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకున్నారు. రెడ్డప్ప కోసం ఆరా తీస్తున్నారు.