Blind Woman Came Kadapa Collectorate : వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్‌కు ఓ అంధురాలు వచ్చింది. తన సమస్యను కలెక్టర్‌కు విన్నవించుకునేందుకు రాగా.. ఆమెతో పాటు సుమారు పది మంది అంధులు వచ్చారు. వారంతా ఒకరి చేయి ఒకరు పట్టుకుని.. ఒకరి వెనక ఒకరు వరుసగా రావటం, కలెక్టరేట్ ప్రాంగణానికి ఇతర పనులపై వచ్చిన వారిని ఆలోచింపజేసింది. ఇంతకీ ఏమైందంటే..
కడప జిల్లాకు చెందిన అంధ మహిళ ఇంటి స్థలాన్ని.. అప్పు ఇచ్చిన వ్యక్తి కబ్జా చేశాడు. పదివేల రూపాయలు అప్పు తీసుకున్నందుకు తన స్థలాన్ని కబ్జా చేశాడని బాధిత మహిళ ఆరోపిస్తోంది. స్థలం కబ్జా చేయటమే కాకుండా.. అప్పులు చేసి ఆ స్థలంలో నిర్మించుకున్న ఇంటిని కూల్చి వేశాడని తెలిపింది. ఇదేంటని ప్రశ్నిస్తే.. తనదే ఆ స్థలమని బెదిరిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.
బాధితురాలి వివరాల ప్రకారం.. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం గ్రామానికి చెందిన నాగవేణి అనే అంధ మహిళకు 15 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఇంటి స్థలాన్ని కేటాయించింది. దీంతో ఆమె అందులో చిన్న ఇంటిని నిర్మించుకుంది. ఐదు సంవత్సరాల క్రితం ఆమెకు నగదు అవసరం కావటంతో.. అదే ప్రాంతానికి చెందిన బాలరాజు అనే వ్యక్తి దగ్గర తాకట్టు పెట్టింది. తాకట్టుగా ఇంటిని తీసుకుని బాలరాజు ఆమెకు 10వేల రూపాయల నగదు ఇచ్చాడు.
నగదు అప్పు తీసుకున్న తర్వాత ఆమె అనారోగ్యానికి గురి కావటంతో పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఇంటిని తాకట్టు పెట్టుకున్న బాలరాజు దానిని అద్దెకు ఇచ్చి.. వచ్చిన అద్దె నగదును అతడే తీసుకున్నాడు. పుట్టింటికి వెళ్లిన నాగవేణి.. కరోనా మహమ్మారి విజృంభించటంతో అక్కడే ఉండిపోయింది. అంతా సద్దుమణిగిన తర్వాత ఆమె ఇంటికి వచ్చింది. కానీ అక్కడ పరిస్థితి తారుమారైంది. తన ఇంటిని బాలరాజు కూల్చివేసి.. చదును చేశాడు.
ఇంటిని కూల్చివేయటాన్ని ప్రశ్నించినందుకు.. ఆ స్థలం నాదే అని బలరాజు అంటున్నాడని ఆమె వాపోయింది. స్థలం ఇవ్వాలంటే వడ్డితో కలిపి 30వేల రూపాయలు చెల్లించాలని బెదిరిస్తున్నాడని తెలిపింది. తాను తీసుకున్నది పది వేల రూపాయల అప్పేనని.. 30వేల రూపాయల అప్పు ఎలా తిరిగి చెల్లించాలని ఆవేదన చెందుతోంది. అంతేకాకుండా తాను తాకట్టు పెట్టిన తర్వాత బాలరాజు.. ఆ ఇంటిని అద్దెకు ఇచ్చి నగదు అతనే తీసుకున్నాడని వివరించింది. దొంగ సంతకాలతో ఆ ఇళ్లు అమ్మినట్లుగా కాగితాలు సృష్టించాడని ఆమె ఆరోపించింది.
ఈ సమస్యపై కమలాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. రెవెన్యూ అధికారులను సంప్రదించినా పరిష్కారం దొరకలేదని.. చివరకు కలెక్టర్‌కు తన గోడు వివరించుకునేందుకు వచ్చానని ఆమె తెలిపింది. ఆమెతో పాటు వచ్చిన అంధులు నాగవేణికి న్యాయం చేయాలని అధికారులను కోరారు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఆమె స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. జిల్లా కలెక్టర్ సమస్యపై సానుకూలంగా స్పందించారు. సమస్యను పరిష్కరిస్తానని బాధిత మహిళకు భరోసానిచ్చారు. కమాలపురం తహసీల్దార్‌కు సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చదవండి :