మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 51వ రోజు సీబీఐ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. కొత్తగా వచ్చిన సీబీఐ ఉన్నతాధికారి రామ్‌కుమార్ ఆధ్వర్యంలో.. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో ఏడుగురు అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వీరిలో ఎక్కువగా వైద్యులు ఉన్నారు. పులివెందులకు చెందిన వైద్యులు డాక్టర్ మధు, కంపౌండర్ ప్రకాష్ రెడ్డి, యురేనియంలో పనిచేసే ఉద్యోగి ఉదయ్ కుమార్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డితో పాటు డాక్టర్ నాయక్.. ప్రొద్దుటూరుకు చెందిన ట్రాక్టర్ షోరూమ్ యజమాని భాస్కర్ రెడ్డి, తిరుపతికి చెందిన డాక్టర్ సతీష్ కుమార్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.
వీరిలో కొందరు వైద్యులు వివేకా హత్య జరిగిన రోజు.. ఆయన బెడ్రూంలో మృతదేహానికి శుభ్రం చేసి కుట్లు వేసినట్లు అనుమానంతో విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. దీంతోపాటు.. వాచ్‌మన్ రంగన్న వాంగ్మూలం కోర్టు ద్వారా సీబీఐ అధికారులు తీసుకున్నారు. నాలుగు రోజుల కిందట జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు వాచ్మెన్ రంగన్న వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాన్ని సీల్డ్ కవర్లో పులివెందల కోర్టుకు పంపించగా.. మేజిస్ట్రేట్ అనుమతితో ఆ వాంగ్మూలం కాపీని అందుకున్నారు. ఆ వాంగ్మూలం ఆధారంగా సీబీఐ విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది.
అంతకుముందు...
నిన్న చేసిన విచారణలో.. సీబీఐ ఉన్నతాధికారి రామ్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు.. గంటన్నరకుపైగా వివేకా ఇంటితోపాటు, పరిసరాలు గమనించారు. కడప నుంచి పులివెందుల వెళ్లిన సీబీఐ అధికారుల బృందం..పలు విషయాలపై ఆరా తీశారు. వివేకా ఇంట్లో ఉన్న ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డితో వారు మాట్లాడారు. హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. ఈ కేసుకు సంబంధించి.. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలు, వారి దృష్టికి వచ్చిన విషయాలపై చర్చించారు. వివేకా ఇంట్లో పరిశీలనల అనంతరం.. సీబీఐ అధికారుల బృందం పులివెందుల పట్టణంలో ఆర్ అండ్ బీ అతిథి గృహానికి వెళ్లింది. అక్కడ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, అతడి భార్యను అధికారులు ప్రశ్నించారు. వాచ్‌మెన్ రంగన్న వాంగ్మూలం తర్వాత.. అనుమానితులను విచారణ చేశారు.
ఇదీ చూడండి:
Huge Floods to Sreesailam: శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. 2 రోజుల్లో నిండే అవకాశం!