Dead bodies: ‘నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడే ఘాట్ రోడ్డది.. ఎత్తుపల్లాలతో ఏ వాహనమైనా నిదానంగా వెళ్లాల్సిందే. అలాంటి చోట వాహనం ఆపి హత్య చేసిన ముగ్గురిని లోయలోకి తీసుకెళ్లి పడేశారు. రెండు జిల్లాల సరిహద్దులో పోలీసులకు సవాల్ విసురుతూ జరిగిన ఈ ఘాతుకం సంచలనం సృష్టించడంతో పాటు చర్చనీయాంశంగా మారింది. కడప శివారులోని గువ్వలచెరువు ఘాట్‌రోడ్డు లోయలో ముగ్గురి హత్య చర్చనీయాంశమైంది. ఇందులో ఇద్దరు పురుషులు కాగా ఒకరు మహిళ. మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా ఉండగా అంతా ఒకే కుటుంబానికి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి హత్యకు కారణం.. వివాహేతర సంబంధమా, ఆస్తి తగాదాలా, కుటుంబ గొడవలా, పాతకక్షలా, ఆర్థిక లావాదేవీలా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డీఎస్పీ వెంకటశివారెడ్డి తెలిపిన మేరకు వివరాలివి.. ‘వైయస్‌ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్‌రోడ్డులోని అయిదో మలుపు సమీపంలోని లోయలో మంగళవారం రాత్రి స్థానికులు మూడు మృతదేహాలను గుర్తించి సమాచారం అందించారు. బుధవారం ఈ మూడు మృతదేహాలను తాళ్ల సహాయంతో బయటికి తీశారు. పది రోజుల కిందట ఎక్కడో హత్య చేసి ప్లాస్టిక్ పట్టలో చుట్టుకుని తీసుకొచ్చి లోయలో పడేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. మహిళకు 25 సంవత్సరాలు, పురుషుల్లో 25 ఏళ్లు, మరొకరికి 50 నుంచి 60 సంవత్సరాలుంటాయని గుర్తించారు. ఓ వ్యక్తి జేబులో ఎర్రటి చిన్న సంచి ఉంది, అందులో పొగాకు పొడి, మరో వ్యక్తి మెడలో వెండి గొలుసు ఉంది. మహిళ మెడలో ఎర్రటి పూసల దండ, చేతికి మట్టిగాజులున్నాయి. మహిళ నైటీ ధరించి ఉంది. కేసు నమోదు చేసి విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశాం. త్వరలో వీరి ఆచూకీ తెలుసుకుని హత్యల మిస్టరీని చేధిస్తాం’ అని డీఎస్పీ వెంకట శివారెడ్డి చెప్పారు. మృతుడు శరీరంపై ఉన్న చొక్కా కాలర్‌కు ఉన్న లేబుల్ ఆధారంగా డీఎస్పీ రాయచోటికి వెళ్లి విచారించారు. రెండు జిల్లాల ఠాణాల పరిధిలో ఇటీవల కనిపించకుండా పోయిన వారి వివరాలు సేకరిస్తున్నారు.
ఇవీ చూడండి: