YS Jagan Narasapuram Tour: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు.. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయం.. సహా బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ శంకుస్ధాపన చేయనున్నారు. నరసాపురం అగ్రికల్చర్ కంపెనీ భూములు రైతులకు ఇవ్వనున్నారు. ఉప్పుటేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్ శంకుస్ధాపన చేయడంతో సహా నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవన ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రజారోగ్యసాంకేతిక శాఖ, నరసాపురం పురపాలక సంఘం, మంచినీటి అభివృద్ధి పథకం ప్రారంభోత్సవం... సహా నరసాపురం బస్‌స్టేషన్ పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఖజానా లెక్కల కార్యాలయం, నరసాపురం శంకుస్థాపన, 220/132/33 కె.వి రుస్తుంబాద విద్యుత్ ఉపకేంద్రం శంకుస్థాపన చేస్తారు.
జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్టులు సహా నరసాపురం అండర్‌గ్రౌండ్ డ్రైనేజి స్కీము శంకుస్థాపన చేయనున్నారు. వశిష్ఠ వారధి – బుడ్డిగవాని రేవు ఏటి గట్టు పటిష్టం చేయడం, శేషావతారం పంట కాలువ అభివృద్ధి పనులు, మొగల్తూరు వియర్ పంట కాలువ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. కాజ, ఈస్ట్ కొక్కిలేరు మరియు ముస్కేపాలెం అవుట్‌ఫాల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి.. 10.50 గంటలకు నరసాపురం చేరుకుంటారు. 11.15 గంటల నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి చేరుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి: