పోలవరం ముంపు మండలాలకు వరద సమాచారం కూడా ప్రభుత్వం ఇవ్వలేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆ ఏడు మండలాల్లో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియనివ్వటం లేదని మండిపడ్డారు.
ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ముందే ఎందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని దేవినేని ఉమ నిలదీశారు. తాగునీరు, ఆహారం దొరక్క వారు అల్లాడుతుంటే... అధికారులు కనీసం కన్నెత్తి చూడటం లేదని మండిపడ్డారు. నిర్వాసితులకు తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లకు వైకాపా ప్రభుత్వం కనీసం రంగులు కూడా వేయలేదని ఆక్షేపించారు.
గతేడాది వరదలు వచ్చినప్పుడు 5 వేల రూపాయలు ఇస్తామని వైకాపా ప్రభుత్వం చెప్పింది. అవి నిర్వాసితులకు అందలేదు. మళ్లీ ఇప్పుడు 2 వేలు ఇస్తున్నామని చెప్తున్నారు. 18 వేల కుటుంబాలను తరలిస్తున్నామంటూ ట్వీట్లు పెట్టిన విజయసాయి ఇప్పుడేం సమాధానం చెబుతారు. ముంపు ప్రాంతాల్లోని వారికి గుక్కెడు తాగునీరు, పిడికెడు ఆహారం ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకున్నట్లు? - దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి
ఇదీ చదవండి