Yamamala Met Chandrababu Naidu in Mulakat: రాజమహేంద్రవరం జైలులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మూలాఖత్‌లో ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు భేటీ అయ్యారు. భేటీలో భాగంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, జనసేన పొత్తు, రాష్ట్ర ప్రజల, కార్యకర్తల క్షేమం, జాతీయ నేతల మద్దతుపై చంద్రబాబు యనమలతో చర్చించారు. అనంతరం జగన్ ప్రభుత్వం.. పార్టీ నేతలు, కార్యకర్తలను వేధించటం తనకు బాధ కలిగిస్తోందని చంద్రబాబు యవమలతో అన్నారు. పార్టీ శ్రేణులకు సీనియర్ నేతలు అండగా నిలవాలని యనమలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎన్ని ఇబ్బందులైనా పడతానన్న చంద్రబాబు.. ప్రభుత్వ అరాచకాలపై పోరాటం మాత్రం ఆపవద్దని కోరారని యనమల వెల్లడించారు.
Yanamala Ramakrishna Comments: చంద్రబాబుతో ములాఖత్ అనంతరం యనమల రామకృష్ణుడు రాజమండ్రి జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. ''చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదు. తప్పులు చేసిన నాయకులే చంద్రబాబును కేసులో ఇరికించారు. తప్పుడు కేసులతో ఈ ప్రభుత్వం చంద్రబాబును వేధిస్తోంది. చంద్రబాబు జైలులో సంతోషంగా లేరు. పార్టీ కార్యకర్తల గురించి చంద్రబాబు అడిగారు. చంద్రబాబు చేసిన కార్యక్రమాల వల్లే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని ఈ ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్ల ప్రజలంతా కష్టాలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ఎప్పుడూ భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. చంద్రబాబు అరెస్టును అనేకమంది జాతీయ నేతలు ఖండించారు. సంఘీభావం తెలిపిన జాతీయ నేతలందరికీ చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పమన్నారు. శాసనసభ సమావేశాలకు హాజరవుతాం. అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించే అంశాలపై నిర్ణయం తీసుకుంటాం'' అని ఆయన అన్నారు.
Chandrababu Discussion With Yanama on party Activities: అనంతరం చంద్రబాబు నాయుడు జైలులో పడుతున్న అవస్థలపై యనమల ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత ఎలా ఉన్నారని తాను చంద్రబాబుని అడగ్గా.. తాను బాగానే ఉన్నానని, క్యాడర్‌ని, నేతల్ని ప్రభుత్వం కక్షతో వేధించటమే బాధగా ఉందని చంద్రబాబు బదులిచ్చారన్నారు. అనంతరం జైల్లో సదుపాయాలు ఎలా ఉన్నాయని తాను అడగ్గా.. తన సౌకర్యాల గురించి బాధ లేదని.. మొదటి మూడు రోజులు దోమల విపరీతంగా ఇబ్బంది పెట్టినట్లు చెప్పారన్నారు. ప్రజలు కోసం ఎన్ని బాధలైనా తట్టుకుంటానని.. పార్టీ, క్యాడర్ మనోధైర్యం కోల్పోకుండా సీనియర్‌లంతా బాధ్యతలు తీసుకోవాలని దిశానిర్దేశం చేసినట్లు యనమల వివరించారు.
There is No AC in Chandrababu Room: చంద్రబాబు గదిలో ఏసీ లేదని.. ఆయన గదిలో ఏసీ ఏర్పాటు చేయాలని అధికారులను విజ్ఞప్తి చేయగా.. నిబంధనల ప్రకారం ఏసీ ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పారని యనమల తెలిపారు. 3 రోజుల తర్వాత చంద్రబాబుకు దోమతెర ఇచ్చినట్లు యనమల పేర్కొన్నారు. అనంతరం జనసేన పొత్తు అంశం ప్రస్తావనకు తెచ్చినట్లు యనమల వివరించారు. పార్టీ తరఫున సమన్వయ కమిటీ సభ్యుల నియామక అంశాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే తెలుగుదేశం-జనసేన శ్రేణులు దేశవిదేశాల్లో కలిసి కార్యక్రమాలు చేస్తున్న తీరు గురించి చంద్రబాబుకు వివరించినట్లు యనమల వెల్లడించారు.