పశ్చిమ గోదావరి జిల్లాలో కమిటీ నిర్ణయించిన ధరలకు నిత్యావసరాలను విక్రయించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. పలు ప్రాంతాల్లో ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు తమకు ఫిర్యాదులు అందుతున్నాయని.. అటువంటి వ్యాపారులపై కేసులు నమోదు చేసి, దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో నిత్యావసర సరకులకు కొరత లేదన్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకోవాలని చూస్తే చట్ట ప్రకారం శిక్షలకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ధరల పట్టికలను దుకాణాల ఎదుట ప్రదర్శించాలన్నారు. ఎక్కడైనా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందితే అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
కడప, ప్రకాశం, అనంతపురం జిల్లాల నుంచి జిల్లాకు 20 టన్నుల పచ్చ అరటిపండ్లు వచ్చాయని జేసీ వెల్లడించారు. రైతు బజార్లు, ఇతర ప్రాంతాల్లో కిలో రూ.10 చొప్పున ప్రజలకు విక్రయించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఎస్‌వో ఎన్.సుబ్బరాజు, మార్కెటింగ్ శాఖ ఏడీ శ్రీనివాసరావు, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజరు నాగమల్లిక తదితరులు పాల్గొన్నారు.
రోజుకు 50 నుంచి 75 కూపన్లు..
జిల్లాలో రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ఇళ్ల వద్దకే రేషన్ సరకులను పంపిణీ చేయిస్తామని సంయుక్త కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. కలెక్టరేట్ నుంచి సోమవారం జిల్లాలోని తహశీల్దార్లు, పురపాలక సంఘాల కమిషనర్లు, సీఎస్‌డీటీలతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండో విడత రేషన్ సరకుల పంపిణీ ప్రక్రియను ఈనెల 16 నుంచి ప్రారంభిస్తామన్నారు.
రెడ్ జోన్ ప్రాంతాల్లో మినహా ఇతర ప్రాంతాల్లోని కార్డుదారులకు ముందుగానే కూపన్లు అందజేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోజుకు 50 నుంచి 75 కూపన్లు మాత్రమే అందజేయాలని, రేషన్ దుకాణాల వద్ద కార్డుదారులు భౌతిక దూరం పాటించేలా గడులు గీయించాలన్నారు. దుకాణాల వద్ద తాగునీటి వసతితో పాటు చేతులను శుభ్రపరచుకునేందుకు సబ్బు, నీళ్లు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. పోర్టబులిటీ సదుపాయమున్న కార్డుదారులకు 3 రోజుల తర్వాత సరకులు పంపిణీ చేయాలని సూచించారు.
ఇవీ చదవండి: