విశాఖ మహా నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్ సృజన... కోవిడ్ నియంత్రణ విధుల్లో కష్టాన్ని లెక్క చేయకుండా శ్రమిస్తున్నారు. ఓ వైపు రోజుల వయసున్న బిడ్డ లాలన చూసుకుంటూనే... మరో వైపు నగర వాసుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత నెరవేరుస్తున్నారు. బాలింతగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో... ఉక్కు సంకల్పంతో విధుల్లోకి చేరారు. పిల్లవాడి బాగోగుల్ని భర్త, తల్లికి అప్పగించి విశాఖ ప్రజల కోసం కష్టపడుతున్నారు. జీవీఎంసీ సిబ్బందిని సమర్థంగా నడిపిస్తూ... ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటున్నారు. ప్రశంసలు అందుకుంటున్నారు.
21 రోజుల బిడ్డను ఇంటి వద్ద వదిలి...
విశాఖ మహా నగర పాలక సంస్థలో కొద్ది రోజుల క్రితం పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. జీవీఎంసీ కమిషనర్గా ఉండాల్సిన సృజన అప్పటికి ప్రసూతి సెలవులో ఉన్నారు. నగరంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో జీవీఎంసీ భాగస్వామ్యం ఎంతో కీలకం. పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకుని నడిపించే సారథి లేక ఎదురవుతున్న ఇబ్బందులను గమనించిన సృజన.. సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. సెలవులను వదిలేసి విధుల్లో చేరారు. అప్పటికి 21 రోజుల క్రితం పుట్టిన శిశువును ఇంటి వద్ద ఉంచి క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై దృష్టి సారించారు. విధులకు హాజరవుతూ వీలైనంత వరకు సాంకేతికతను వినియోగించుకుంటూ సిబ్బందికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
విశాఖ ప్రజలను మహమ్మారి కోరల నుంచి కాపాడేందుకు కృషి చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందిని సమర్థంగా నడిపిస్తూ సృజన ఆదర్శంగా నిలుస్తున్నారు. రెవెన్యూ, పోలీసు విభాగాల్ని సమన్వయం చేసుకుంటూ కరోనాపై జరుగుతున్న యుద్ధంలో విశాఖ నగరానికి సంబంధించినంత వరకూ కీలక భూమిక పోషిస్తున్నారు.
ఇవీ చదవండి: