arrest: పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari district) లో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు(two-wheelers theft) పాల్పడుతున్న ఇద్దరు నిందితులను నరసాపురం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 15 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు నరసాపురం డీఎస్పీ పి.వీరాంజనేయ రెడ్డి తెలిపారు.
ఏలూరుకు చెందిన కొండేటి నాగార్జున, మొగల్తూరు మండలం చింతారేవుకు చెందిన కొల్లాటి తిరుపతి రాజు అలియాస్ యమహా రాజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బైకు చోరీలకు పాల్పడే వారని పోలీసులు తెలిపారు. నాగార్జున ద్విచక్రవాహనాలు తస్కరించి తిరుపతి రాజుకు అప్పగిస్తే... అతడు విక్రయించే వాడన్నారు. పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో పాత నేరస్తుడు అయినా కొండేటి నాగార్జునపై నిఘా ఉంచామన్నారు. ఓ మోటార్ సైకిల్ కంపెనీ షోరూమ్‌లో పనిచేస్తున్నప్పుడు తిరుపతి రాజుకు నాగార్జునతో పరిచయం ఏర్పడిందని.. అప్పటి నుంచి ఇద్దరు కలసి వాహనాల దొంగతనాలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. కొంతకాలంగా వీరిద్దరు జిల్లాలోని ఏలూరు, భీమవరం, నరసాపురంలో వరుసగా బైకులు చోరీ చేసినట్లు పోలీస్ నిఘాలో తేలిందన్నారు. కాగా మంగళవారం సాయంత్రం ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: visaka accident: జాతీయ రహదారిపై ప్రమాదం...సీఐ ఈశ్వరరావు మృతి