వాటర్ గ్రిడ్ కింద తొలి విడతగా 6 జిల్లాల్లో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.12,308 కోట్లు కేటాయించింది. తూర్పుగోదావరి జిల్లాకు రూ.3,960 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాకు రూ.3,670 కోట్లు, శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి రూ. 700 కోట్లు, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి రూ.2,665 కోట్లు, ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి రూ.833 కోట్లు, కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి రూ.480 కోట్లు కేటాయించారు. 30 ఏళ్లపాటు తాగునీటి అవసరాలు తీర్చేలా.. రూ.57,622 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకానికి రూపకల్పన చేశారు. తొలివిడతగా తీవ్ర మంచినీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రాంతాల్లో పనులు చేపట్టేందుకు పరిపాలనా అనుమతి ఇచ్చారు. టెండర్లు నిర్వహించి, ఈ నెల 16లోగా న్యాయ సమీక్షకు పంపాలని నిర్ణయించారు. జూన్ మొదటివారంలో పనులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి
వాటర్ గ్రిడ్‌లో భాగంగా 48,662 ఆవాసాల్లోని అన్ని ఇళ్లకు తాగునీటిని అందించనున్నారు. రాష్ట్రంలో 94.13 లక్షల నివాసాలు ఉండగా.. ఇప్పటికే 31.58 లక్షల గృహాలకు కుళాయిలు ఉన్నాయి. మిగిలిన నివాసాలకు వాటర్‌గ్రిడ్ కింద కనెక్షన్లు ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి: దేశంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 918 కేసులు