పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం జలపవారిగూడెం గ్రామంలో విషాదం నెలకొంది. జలపవారిగూడెం గ్రామానికి చెందిన మోతే రాటాలు(30) అనే వ్యక్తి .. ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఏడాది కాలంగా గ్రామంలో అతను వాలంటీర్‌గా పని చేస్తున్నారు. గత ఐదేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి తల్లిదండ్రులతో ఉంటున్న రాటాలు మానసికంగా కుంగిపోయాడు.
గత కొంత కాలంగా మద్యానికి బానిసై మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. రాటాలు చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. అదే గ్రామానికి చెందిన గరిక నాగరాజు (గణేష్) అని పిలువబడే వ్యక్తి తనకు చేతబడి చేస్తున్నాడని... అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్లో రాశాడు. అతను మతిస్థిమితం లేకపోవడంతో ఈ విధంగా రాశాడని.. ఎవరూ అతనిపై ఎలాంటి చేతబడి చేయలేదని స్థానికులు చెబుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు ఉండగానే పక్కగదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో.. వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు.
ఇదీ చూడండి. తేనెటీగల దాడిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మృతి