పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం గుండుగోలనుగుంట గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారని నిరసన చేపట్టారు. గ్రామంలో మొత్తం 105 మంది అర్హులు ఉండగా వారిలో 42 మంది పేర్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యవర్తులకు 10 వేలు ఇచ్చిన వారికి మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించారని ఆరోపించారు.
రీ వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్న వారికి ఇళ్ల స్థలాల కేటాయించక పోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని గ్రామస్థులు హెచ్చరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పంచాయతీ కార్యదర్శి సుజాత అర్హత ఉన్నవారికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు దీంతో వారు ఆందోళన విరమించారు.