ఓ వైపు తంబోరిన్... మరో వైపు వీణ... ఇంకోవైపు హోర్మోనియం... ఇలా వివిధ సంగీత వాయిదాల్యతో స్వరాలు పలికిస్తున్న ఈయన పేరు ఎస్పీఎస్.వాసు. సాధారణంగా ఎంతటి సంగీత విధ్వాంసులకైనా ఒకటి లేదా రెండు వాయిద్యాలపై ప్రావీణ్యం ఉంటుంది. ఈ సంగీత మాస్టారుకు ఏకంగా 30 సంగీత వాయిద్యాలపై పట్టు ఉంది. ఆ ప్రతిభతోనే 30 సంగీత వాయిద్య పరికరాలు ఉపయోగించి వందేమాతర గీతాన్ని రూపొందించారు. ఈ ఆల్బమ్ తయారీకి దాదాపు నెల రోజులపాటు సాధన చేశారు. గతంలో 24 సంగీత పరికరాలు వినియోగించి.. జనగణమణను ఆలపించి మన్ననలు పొందారు. తాజాగా సొబగులు అద్దిన వందేమాతర గీతానికీ విశేష ఆదరణ లభిస్తోంది.
సంగీత విధ్వాంసుల కుటుంబంలో పుట్టిన వాసు.. చిన్ననాటి నుంచే సంగీతం నేర్చుకొన్నారు. ఇంటర్‌తోనే చదువు ఆపేసి, నిరంతరం కొత్త ఆలోచనలతో సంగీత సాధన చేస్తున్నారు. 22ఏళ్ల వయసులోనే రెండు వందలకు పైగా మ్యూజిక్, ప్రైవేటు ఆల్బమ్‌లు రూపొందించారు. ఫ్లూట్, సితార వాయించడంలో ఉన్న ప్రావీణ్యం.. పలువురు సంగీత దర్శకుల వద్ద పనిచేసే అవకాశం కల్పించింది. సంగీతంలోనే కాదు, మధురమైన గాత్రంతోనూ మెప్పించారు. స్వరానికి స్వీయ సంగీతం అందించి.. 'నియినివేశం' అనే ఆల్బమ్ రూపొందించారు. అనేక సంగీత ఉత్సవాల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంటున్నారు.
వాసుకు ఫ్లూట్, సితారపై మాత్రమే ప్రావీణ్యత ఉండేది. ఆల్బమ్‌ల కోసం వివిధ సంగీత పరికరాలు వాయించడం నేర్చుకున్నారు. ఇంటి వద్దే ప్రత్యేక రికార్డింగ్ గదులు ఏర్పాటు చేశారు. ఖరీదైన దేశవిదేశాల వాయిద్య పరికరాలు కొనుగోలు చేశారు. జ్ఞానాన్ని పది మందికి పంచాలన్న ఆలోచనతో సంగీత పాఠశాలను స్థాపించారు. వివిధ వాయిద్య పరికరాలపైనా విద్యార్థులకు శిక్షణిస్తున్నారు. స్వర కల్పనలో ప్రపంచ రికార్డు సాధించడమే లక్ష్యంగా వాసు చెబుతున్నారు.
ఇదీచదవండి.