'ఉండి నియోజకవర్గంలోని ఓ నాయకుడు మూలంగా పార్టీ ప్రతిష్ఠ రోజు రోజుకూ దిగజారుతోంది. పార్టీ కోసం పదేళ్లు కష్టపడిన వైకాపా కార్యకర్తలను కాదని తెదేపా నుంచి వచ్చిన నాయకులకు పదవులు కట్టబెడుతున్నారు. పక్క పార్టీ వారికి పదవులు, వైకాపా కార్యకర్తలపై పోలీసు కేసులు' అంటూ పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఉండి నియోజకవర్గ వైకాపా కన్వీనర్ తీరుపై అసహనంతో ఆ పార్టీ కార్యకర్తలు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసినట్లు తెలిస్తోంది.
ఓ వైకాపా నాయకుడు వల్ల కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని నియోజకవర్గంలోని పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో ఆ పార్టీ కార్యకర్తలు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భీమవరం-తాడేపల్లిగూడెం రోడ్డులోనూ ఫ్లెక్సీలు పెట్టారు. నియోజవర్గ కన్వీనర్ వైకాపా కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని, తెదేపా నుంచి వచ్చిన నాయకులకే పదవులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడిన తమను కాదని ఇప్పుడు పార్టీలోకి వచ్చిన తెదేపా నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు అని వాపోతున్నారు. నియోజకవర్గంలో ఈ ప్లెక్సీల ఏర్పాటుపై చర్చ నడుస్తుంది. అధిష్ఠానం తమకు న్యాయం చేయాలని వైకాపా కార్యకర్తలు కోరుతున్నారు.
దీక్షకు దిగిన వైకాపా నేత
గొల్లలకోడేరు గ్రామ వైకాపా కన్వీనర్ కలిదిండి శ్రీనివాస వర్మ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. తమ పార్టీలోనే కొందరి నేతల ఒత్తిడి వల్ల ఫ్లెక్సీలు తొలగించారని ఆరోపిస్తూ శ్రీనివాస వర్మ నిరాహార దీక్ష చేపట్టారు. నియోజకవర్గంలోని ఓ నేత వల్ల మొదటి నుంచి కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. తెదేపా నుంచి పార్టీలోకి వచ్చిన వారు అధికారం చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఈ సమస్య ఉన్నా నియోజకవర్గ కన్వీనర్ సమస్యలు పరిష్కరించడం లేదని విమర్శించారు. కార్యకర్తల కోసం ఈ దీక్షను చేపట్టానని శ్రీనివాస వర్మ అన్నారు. అధిష్ఠానం ఇక్కడ జరుగుతున్న విషయాలను పరిశీలించాలన్నారు. నియోజకవర్గంలో జూదం, అవినీతి పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు.
ఇదీ చదవండి : సొంత పార్టీ ఎంపీపై స్పీకర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు