గోదావరి నది మరోసారి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి క్రమక్రమంగా నదికి వరద వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఇవాళ ఉదయం 7 గంటల సమయానికి 8.80 అడుగుల నీటిమట్టం ఉంది. వరద నీరు వస్తున్నందున పంట కాల్వలకు పంట కాల్వలకు 13,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సముద్రంలోకి 5.11 లక్షల క్యూసెక్కుల నీరును వదులుతున్నారు.
ఆందోళనలో దేవీపట్నం వాసులు
కొన్ని రోజుల ముందు వరకు వరద గుప్పిట్లో ఉండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం వాసుల్ని గోదావరి నది మరోసారి భయపెడుతోంది. వీరవరపులంక కాఫర్ డ్యామ్ వరద ఉద్ధృతి పెరుగుతోంది. దేవీపట్నం మండలం వీరవరం కాడెమ్మ వాగు ద్వారా రహదారిపైకి వరద నీరు వచ్చిచేరుతోంది. తొయ్యేరు-దేవీపట్నం మధ్య రహదారిపై ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనితో దేవీపట్నం వాసులు ఆందోళనకు గురవుతున్నారు. అలాగే దండంగి వద్ద సీతపల్లి వాగులోకి వరదనీరు చేరి చప్టా మునిగింది. గండిపోచమ్మ ఆలయం వద్ద పరిస్థితి ఉద్ధృతంగా ఉంది. వరద ముంపుతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. జిల్లాలోని పూడిపల్లిని వరద ప్రవాహం చుట్టుముట్టింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామాలు జలదిగ్బందం
వరద నీటితో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. వేలేరుపాడు మండలంలో ఎడవల్లి-గొల్లపల్లి మధ్య ఎద్దువాగుపైకి వరద నీరు వచ్చిచేరుతోంది. ఎద్దువాగు ఉద్ధృతితో 16 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. పోలవరం మండలం కొత్తూరు వంతెనపైకి భారీగా వరద ప్రవాహం వస్తోంది. కొత్తూరు వంతెనపై వరద ప్రవాహంతో 19 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పలు గ్రామాల్లో పంటలు నీటమునిగి రైతులకు నష్టాన్ని మిగిల్చాయి.