పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నాటుసారా మృతుల కుటుంబాలను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు పరామర్శించారు. పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున.. మొత్తం 27కుటుంబాలకు రూ.27లక్షలు పరిహారం అందచేశారు.
తొలి ఫేక్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి
జె బ్రాండ్ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్యేలకు వాటాలు దక్కనందుకే కల్తీసారా వ్యాపారం మొదలుపెట్టారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. శాసనసభలో అసత్యాలు చెప్పిన జగన్మోహన్ రెడ్డిని గవర్నర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర భారత దేశంలో తొలి ఫేక్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. జంగారెడ్డి గూడెం మరణాలపై కనీసం వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా సహజమరణాలుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.ఏపీలో పెగాసెస్ తెదేపా ప్రభుత్వం కొనలేదని మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆర్టీఐకి సమాధానం ఇచ్చిన దానిపై సీఎం ఏం చెప్తారని ప్రశ్నించారు.
తండ్రి తాగితేనే కుమారుడికి అమ్మ ఒడి ..
గత ప్రభుత్వ హయాంలో రూ.6వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని రూ.16వేల కోట్లకు పెంచుకోవటమే జగన్ రెడ్డి చేపట్టిన మద్య నిషేధమా అని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ నిలదీశారు. తండ్రి తాగితేనే కుమారుడికి అమ్మ ఒడి వస్తుందని..., కొడుకు తాగితేనే తల్లికి ఫించన్ వచ్చేలా మద్యం పాలసీ తెచ్చారని మండిపడ్డారు. ఓటు అనే ఆయుధంతోనే జగన్ రెడ్డికి గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
మత్తులో దించి ... దోపిడి చేస్తున్నారు..
జనాలను మత్తులో దించి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దోపిడి చేస్తున్నారని మాజీమంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం, సారా, గంజాయి విచ్చలవిడిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గపు పాలన అంతమొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
జగన్ రెడ్డే ప్రమోట్ చేస్తున్నారు
నాటుసారా, చీప్ లిక్కర్‌ను ముఖ్యమంత్రి జగన్ రెడ్డే ప్రమోట్ చేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్ప, తెదేపా శాసనసభ పక్ష విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. కల్తీ నాటుసారా, జే బ్రాండ్ మద్యం మరణాలపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా సీఎం వైఖరిలో మార్పు లేదని మండిపడ్డారు. కనిపించని వేలాది కల్తీసారా మరణాలకు జంగారెడ్డి గూడెం ఘటన ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆ దృష్టి మళ్లించేందుకే.. పెగాసెస్ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు: తెదేపా