తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన అరెస్టును నిరసిస్తూ.. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో చింతమనేని ప్రభాకర్‌ను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్‌గేటు వద్ద పోలీసులు భారీగా మోహరించి ..చింతమనేనిని బలవంతంగా అరెస్టు చేశారు. దెందులూరు నుంచి కలపర్రుకు చింతమనేని వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనంలో నుంచి బలవంతంగా కిందకు దించి పోలీసు వాహనంలోకి ఎక్కించారు. ఈ క్రమంలో తెదేపా కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని పోలీసు వాహనాన్ని అడ్డగించి ధర్నా చేపట్టారు. చింతమనేనిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. చింతమనేనిని అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ను ఎక్కడికి తీసుకెళ్లింది వెల్లడించలేదు.
ఇదీ చదవండి: పూర్తి వేతనాలు చెల్లించని కంపెనీలపై చర్యలొద్దు: సుప్రీం