గడిచిన నాలుగు రోజుల్లో ఎడతెరిపి లేని వర్షాలతో పశ్చిమగోదావరి జిల్లాలో వరితో పాటు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఒక పక్క వర్షాలతో పల్లపు ప్రాంతాలలోని పంటలు దెబ్బ తింటే.... మరోవైపు గోదావరి వరద ప్రభావంతో లంక భూముల్లోని తోటలు, పాదులు నీటమునిగాయి.
తణుకు, ఉండ్రాజవరం, పెరవలి, అత్తిలి మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వందలాది ఎకరాలలో పంటలు తడిసి ముద్దయ్యాయి. జిల్లాలో 12,139 ఎకరాలలో పంట నష్టం వాటిల్లినట్టు జిల్లా వ్యవసాయ శాఖ గణాంకాలు చెపుతున్నాయి. ఇందులో అధికశాతం తణుకు, పరిసర మండలాలకు చెందినవే.
గతంలో యనమదుర్రు కాలువ పొంగిపొర్లి ప్రవహించటంతో ఉండ్రాజవరం మండలం పసలపూడి వద్ద గండి పడి వందల ఎకరాలలో పంట పాడైంది. తణుకు, ఉండ్రాజవరం, అత్తిలి, భీమవరం మండలాలల్లో పంట నష్టానికి గురైంది. అయినప్పటికీ అధికారులు తాత్కాలిక చర్యలతో సరిపెట్టారు. దీనివల్ల ఇప్పటికీ ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. గట్టు పరిస్థితి రోజురోజుకు దిగజారటంతో ఎక్కడ గండి పడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పెరవలి మండలంలో ఖండవల్లి, ముక్కామల, తీపర్రు తదితర గ్రామాల పరిధిలో లంక భూముల్లో పంటలు దెబ్బతిన్నాయి. అరటి, కంద, పచ్చిమిచ్చి తోటలతోపాటు కూరగాయల పాదులు నీటిపాలయ్యాయి. నీట మునిగిన తోటలను, పాదులను కాపాడుకోవటానికి పెరవలిమండలంలో పలువురు రైతులు ఆయిలు ఇంజన్లు ఏర్పాటు చేసి నీటిని బయటికి తోడుకున్నారు. ఎర్రకాలువ, యనమదుర్రు కాలువ గట్టులను బలపరిచి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.