సహజసిద్ధమైన కొల్లేరులో రంగురంగల పక్షులు వీనుల విందు చేసేవి. సహజసిద్ధమైన చేపలవేటతో అందమైన కొల్లేరు.. చూపరులను ఆకర్షించేది. చేపల మాఫియా అడుగుపెట్టాక కొల్లేరు భౌగోళిక చిత్రమే మారిపోయింది. కొల్లేరుకు నీరురాకుండా అడ్డుకట్ట పడింది. చెట్లు, పొదలు తొలగించారు. పక్షులను బెదరగొట్టారు. కొన్నింటిని చంపేశారు. ఆహారం, ఆవాసం కోల్పోయిన పక్షులు... ఇక్కడ అభద్రతకు లోనయ్యాయి. చాలా పక్షులు ఎగిరిపోగా.. మరికొన్ని ఆకలితో చచ్చిపోయాయి. వీదేశీ పక్షులు రాక క్రమంగా తగ్గింది.
గతంలో ఏడాది పొడవునా కొల్లేరులో నీరుండేది. కాలక్రమంలో కేవలం వర్షాకాలం 3నెలలే నీరు ఉంటోంది. నీరులేక పక్షులు ఉండటంలేదు. కాలుష్యఉద్గరాలతో నిండిన నీరు చేరుతున్నందున చేపజాతులు అంతరించపోతున్నాయి. చేపలు, నత్తలు, పీతలు, రొయ్యలు వంటి జలచరాలు అంతరించి పక్షులకు ఆహారం కరువవుతోంది.
కృత్రిమంగా ఏర్పాటు చేసిన చెరువుల్లో పక్షులు వాలకుండా బాణసంచా పేలుస్తున్నారు. విషపు ఎరలు పెట్టి చంపుతున్నారు. ఏడు కాంటూర్లు విస్తరించిన కొల్లేరును ఐదు కాంటూర్లకు కుదించారు. ఐదోకాంటూరు వరకు ఉన్న చేపలు, రొయ్యల చెరువులు ధ్వంసం చేశారు. కొల్లేరులో పర్యావరణం దెబ్బతినకుండా చర్యలు చేపట్టారు. పక్షుల ఆవాసానికి అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేశారు. గుడివాకలంక, ఆటపాక వద్ద పక్షుల విడిదే కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కొల్లేరులో పక్షులు సంతానాన్ని వృద్ధి చేసుకొనేందుకు కృత్రిమ స్టాండ్లను అమర్చారు. పక్షుల వేట నియంత్రించడానికి అటవీశాఖ చర్యలు చేపట్టింది. ఈ చర్యలు సత్ఫలితాలివ్వడం లేదు. అక్టోబర్ లో వచ్చే విదేశీ పక్షులు 50 శాతానికి పైగా తగ్గిపోయినట్లు అధికారులే పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పాలక, అధికార వర్గాలు చర్యలు చేపట్టి కొల్లేరులో పక్షులు ఆవాసానికి అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేయాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి