పశ్చిమగోదావరి జిల్లా తణుకు, నిడదవోలు పరిధిలోని 6 మండలాల్లోనూ.. ప్రలోభాల పర్వం ప్రారంభమైంది. తణుకు సమీపంలోని ఓ గ్రామం రిజర్వ్ కావడంతో.. అభ్యర్థులకు మద్దతిస్తున్న నేతలు ఓటర్లకు బాగానే ముట్టజెప్పారు. తాత్కాలిక రేషన్ కార్డు కలిగిన ప్రతి ఇంటికీ.. ఓ పార్టీ మద్దతుదారుడు 10 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశాడు. మరో అభ్యర్థి ప్రతి మహిళా ఓటరుకూ 10 కిలోల బియ్యంతో పాటు రూ.500 పైగా విలువ చేసే చీరను అందజేశారు. నగదు పంపిణీ చేస్తున్నట్లూ తెలుస్తోంది.
అదే మండలంలోని ఓ ప్రధాన గ్రామంలోనూ ఒక్కో ఓటరుకూ సుమారు రూ. 2వేల వరకు ఇస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. తణుకు మండల కేంద్రంలో ఒక వర్గంవారు రూ.500 పంపిణీ చేయగా.. మరో వర్గమూ అదే స్థాయిలో పంపిణీ చేస్తున్నట్లు వినికిడి. తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో వార్డు అభ్యర్థులకు ఎన్నికల గుర్తుగా కుక్కర్ని ఈసీ కేటాయించింది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వారిలో కొందరు కుక్కర్లను ఇస్తున్నారు. పోలింగ్ ప్రారంభానికి రెండు, మూడు గంటల ముందు వరకు తాయిలాల పంపిణీ కొనసాగే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది.
ఇదీ చదవండి: