MP Raghurama Raju on capital: ఆర్థిక నేరాల కేసులు, బాబాయి హత్య కేసు, రాజధాని కేసులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడంతో ప్రభుత్వ పెద్దలు సరికొత్త భాష్యాలు అందుకున్నారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రాష్ట్ర రాజధానిపై మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడితే రానున్న ఎన్నికల్లో ప్రజలు గూబ గుయ్యిమనిపిస్తారని హెచ్చరించారు. ఆర్థిక మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే... సీఎం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేసిన రాజధానిని, తిరిగి పార్లమెంటు చట్టం ద్వారానే మార్చడానికి వీలవుతుందని రఘురామకృష్ణరాజు అన్నారు. బుగ్గన, సజ్జల, ధర్మాన ప్రసాదరావు నోటికొచ్చినట్లు మాట్లాడినంత మాత్రాన రాష్ట్ర రాజధాని మారదని తేల్చి చెప్పారు. మంత్రుల మాటలు చూసి.. వాళ్లకి మెదడు పని చేయడం లేదని ప్రజలు బావిస్తున్నారన్నారు.
రాజధాని కేసుపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ద్వారా అమరావతే రాజధాని అని స్పష్టంగా చెప్పిందన్నారు. అయినా ప్రభుత్వ పెద్దలకు అర్థమయిందో లేదో, అర్థమయినా... అర్థం కానట్లు నటిస్తున్నారో తెలియడం లేదన్నారు. విశాఖ ఒక్కటే రాజధాని అని, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మూడు రాజధానులనే అంశం ప్రాచుర్యంలోకి వచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన తన మనసులో మాట చెప్పారని రఘురామ అన్నారు. బుగ్గన వ్యాఖ్యలతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వచ్చే అవకాశం ఉందని గ్రహించి... ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. మంత్రి ఒకటి మాట్లాడితే... సలహాదారు మరొకటి అంటారని ఎద్దేవా చేశారు.
అమరావతి విషయంలో మంత్రులు, సలహాదారుల మాటలు చూసి రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వలేక ఆర్థిక అవస్థలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం... మెడికల్, ఇంటర్మీడియట్ బోర్డు నిధులతో పాటు, ఆయుష్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా నొక్కేసిందని విమర్శించారు. సొంతంగా దమ్మిడీ ఖర్చు చేయని ప్రభుత్వ పథకాలకు తన తండ్రి పేరు, లేదంటే తన పేరు పెట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి... సొంత ఆస్తులకు మాత్రం పెట్టుకోవడం లేదని దుయ్యబట్టారు. కడప ఉక్కు కర్మాగార శంకుస్థాపన.. చెల్లి పెళ్లి మళ్లీ జరగాలన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి: