People Suffering Due to Poor Drainage System in TIDCO Houses: ఇది పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం సమీపంలోని గునుపూడి టిడ్కో గృహసముదాయ ప్రాంతం. తెలుగుదేశం హయాంలోనే.. దాదాపు 80 శాతం పనులు పూర్తైన ఈ గృహాలవైపు దాదాపు మూడేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు.
ప్రతిపక్షాలు రోడ్డెక్కి ఆందోళనలు చేయడం, పలు వర్గాల నుంచి పెద్దఎత్తున విమర్శలు రావడంతో పార్టీ రంగులేసి.. లబ్ధిదారులకు గృహాలు అందజేశారు. పట్టణాల్లో అద్దెలు చెల్లించే స్తోమత లేక.. టిడ్కో గృహ సముదాయాల్లోకి వచ్చి ఏడాదిగా నివాసం ఉంటున్న లబ్ధిదారులకు నిత్యం సమస్యలు వెంటాడుతున్నాయి.
పంట పొలాల్లో 'టిడ్కో' వ్యర్థాలు, తలలు పట్టుకుంటున్న రైతులు
ఇళ్లిచ్చాం.. ఇక మీ పాట్లు మీరు పడండి అన్నట్లుగా అటు.. నిర్మాణ సంస్థ, ఇటు.. నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సిన భీమవరం పురపాలక సంస్థ రెండూ మాకు సంబంధం లేదంటూ చేతులెత్తేయడంతో గృహసముదాయంలో ఉంటున్న జనం అల్లాడిపోతున్నారు. సముదాయాల చుట్టూ.. పెద్దఎత్తున పిచ్చిమొక్కలు మొలిచి అడవులను తలిపిస్తున్నాయి. పరిశుభ్రంగా ఉండాల్సిన పరిసరాలు.. మురికి కూపాలను ఉన్నాయి.
డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారడంతో నీళ్లు వెళ్లే దారిలేక సముదాయాల చుట్టూ చేరి దుర్గంధం వెదజల్లుతోంది. ఇళ్లలో వాడుకున్న వ్యర్థ జలాలు.. గొట్టాల ద్వారా సాఫీగా వెళ్లకపోవడం వల్ల.. ఎక్కడికక్కడ ఇళ్లలోకి లీకవుతోందని.. కాలనీ వాసులు వాపోతున్నారు. లీకైన నీటి నుంచి వచ్చే దుర్ఘంధంతో కాలనీ వాసులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు.
భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌తో సహా.. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో లబ్ధిదారులు దిక్కుతోచనిస్థితిలో కాలం వెల్లదీస్తున్నారు. నిర్వహణ బాధ్యత మాది కాదంటే మాది కాదంటూ అటు నిర్మాణ సంస్థ, ఇటు పురపాలక సంస్థలు తెగేసి చెప్పడంతో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరికి విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోవడంతో ఇళ్ల మధ్య పెరిగిపోయిన తుప్పలను ఎవరికి వారే తలా కొంత డబ్బులు పోగు చేసుకుని శుభ్రం చేయించుకుంటున్నారు.
ఇళ్లిచ్చినా సుఖం లేదని.. ఎందుకువచ్చామా అని తలలు బాదుకుంటున్నారు. రంగులేయడంలో ఉన్న శ్రద్ధ.. సముదాయాల్లో సమస్యలు పరిష్కరించడంలో లేదని లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా టిడ్కో సముదాయాలను పరిశీలించి తమ సమస్యలు పరిష్కరించాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు.
Tidco Houses Lacked Security: టిడ్కో ఇళ్లలో భద్రత కరవు.. మూడేళ్ల చిన్నారిని చిదిమేసిన విద్యుత్ తీగలు
"నిద్ర కూడా లేకుండా ఇంట్లో ఉన్న నీరు మొత్తం బయటకు తోడుతున్నాం. నీరు వెళ్లడానికి దారి లేదు. ఇళ్లు ఇచ్చినా సంతోషం లేకుండా పోయింది. తీసుకొచ్చి నరకంలోకి పడేసినట్లు అయిపోయింది. దీని కారణంగా ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రికి వెళ్లి సెలైన్లు ఎక్కించుకున్నాను. సచివాలయానికి వెళ్లాను, అధికారులను కలిశాను.. వస్తాము, చూస్తాము అన్నారు కానీ ఎవరూ రాలేదు". - సీతమ్మ, టిడ్కో నివాసి