పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు గోదావరి వరద భయంతో వణికిపోతున్నారు. గతంలో గోదావరికి వరద వస్తే.. కాస్తోకూస్తో సహాయ చర్యలు ఉండేవి. కరోనా కాలంలో ఆ పరిస్థితి ప్రస్తుతం కనిపించక తల్లడిల్లిపోతున్నారు. ముంపు గ్రామాలకు అవసరమైన కనీస లాంచీలూ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. వరద ముప్పును ఎదుర్కొనేందుకు.. యంత్రాంగాన్ని సన్నద్ధం చేసేందుకు ఏటా నిర్వహించే సమీక్షలూ కరవయ్యాయి. పెరుగుతున్న గోదావరి వరదతో పశ్చిమగోదావరి జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజలు భయాందోళన మధ్య కాలం వెళ్లదీస్తున్నారు.
నిర్వాసితుల ఆవేదన
గతేడాది గోదావరికి జులై నుంచే వరద ప్రారంభమై నెలరోజుల పాటు.. ముంపు గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసింది. లాంచీలు, పునరావాస కేంద్రాలు, ఆహార సరఫరా వంటి సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఏడాది అలాంటి ఏర్పాట్లు మచ్చుకైనా కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జులై నాటికి నిర్వాసిత కాలనీలు పూర్తిచేసి తొలి విడతలో 15 వేల కుటుంబాలు తరలిస్తామన్న అధికారులు చేతులెత్తేశారని.... కనీసం వరదను దృష్టిలో పెట్టుకొని చేపట్టాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు. వరద వస్తే ఎటుపోవాలో తెలియని అయోమయ స్థితిలో ముంపు గ్రామాల ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో సుమారు 50 గ్రామాలకు పైగా వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. వరదొస్తే నిత్యావసరాలు, కూరగాయలు, వైద్యం అందని పరిస్థితి. గతంలో గోదావరికి వరద వచ్చే ముందే లాంచీలు ఆయా గ్రామాలకు చేరేవి. గత ఏడాది కచ్చులూరు వద్ద లాంచీ మునిగిన ఘటనతో సరంగుల నిబంధనలు కఠినతరం చేశారు. ఈ కారణంగా లాంచీలు నడిపేందుకు ఎవరూ ముందుకురావడం లేదు. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.
కరోనా వ్యాప్తి కారణంగా సహాయ చర్యలు ఆలస్యమవుతున్నాయని అధికారులు అంటున్నారు. సమీక్షా సమావేశాలు అందుకే నిర్వహించడం లేదని చెబుతున్నారు.
ఇదీ చూడండి: