పశ్చిమ గోదావరి జిల్లాలో రబీ కాలానికి సంబంధించి ధాన్యం కొనుగోలుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 336 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈనెల 3న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. రబీ కాలానికి సంబంధించి.. జిల్లాలో 13, 64, 560 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేలా ప్రణాళికలు వేశారు. ఈ లక్ష్యం మరింత పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ధాన్యం కొనుగోలుకు అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే కొనుగోలు కేంద్రాల వద్ద తగిన జాగ్రత్తలను పాటిస్తూ.. ప్రభుత్వం నిర్ధరించిన కనీస మద్దతు ధరతో.. రైతుల నుంచి ధాన్యం కొనేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
తగ్గిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో గత ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలు కోసం 344 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుత రబీ కాలానికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు తగ్గాయి. ప్రస్తుతం జిల్లాలో 336 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో సహకార సంఘాల ఆధ్వర్యంలో 217, వెలుగు ఆధ్వర్యంలో 106, డీసీఎంఎస్ ద్వారా 13 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో మరికొన్ని పెంచే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
10 శాతం స్థానిక అవసరాలకు..
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు 90 లక్షల గోనె సంచులు అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెప్పారు. ఇవి కాకుండా రైస్ మిల్లర్ల వద్ద కొన్ని సంచులు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసే ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమ శాతాన్ని కొలిచే యంత్రాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. తేమ శాతం 17 వరకు ఉండాలనేది ప్రభుత్వ నిబంధన అని.. రైతుల నుంచి సేకరించే ధాన్యంలో 10 శాతం ధాన్యాన్ని స్థానిక అవసరాలకు అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని వివరించారు.
ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తాం
జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల సంస్థ మేనేజర్ తెలిపారు. ఈ విషయంలో అన్నదాతలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తొందరపడి ధాన్యాన్ని దళారులకు విక్రయించొద్దన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సామాజిక దూరం పాటించాలని సూచించారు.
ధాన్యం కనీస మద్దతు ధరలు
సాధారణ రకపు ధాన్యం ఒక క్వింటా రూ. 1815
గ్రేడ్-ఏ రకపు ధాన్యం ఒక క్వింటా రూ. 1835
ఇవీ చదవండి: