అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసినవి, రెండంతస్తుల భవనానికి అనుమతులు తీసుకుని ఆపై అదనంగా నిర్మాణాలు చేసినవి, వాస్తుకు అనుగుణంగా అదనపు విస్తీర్ణంలో కట్టడాలు, నాన్‌లేఅవుట్‌లో భవనాలు వంటి వాటిని బీపీఎస్‌లో క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంది. స్థలం వివరాలు, ఈసీ, ప్రభుత్వ అనుమతులు తీసుకున్న వారైతే నిర్మాణ ప్లాన్‌ను బీపీఎస్ పరిష్కార సమయంలో సమర్పించాలి. అనధికారికమైతే ప్రభుత్వ నిబంధనల మేరకు నగదు చెల్లించాల్సి ఉంటుంది.
1985 నుంచి 2018 సెప్టెంబరు నెలాఖరు వరకు నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు జీవో విడుదల చేయగా దాన్ని మూడు నెలలు పొడిగిస్తూ గతేడాది జనవరిలో ఒకసారి.. ఆపై మరో మూడు నెలలు.. అలా జూన్ అంటూనే ఈ నెలాఖరుకు గడువు పొడిగించారు.
దరఖాస్తులు వెల్లువ..
2014 డిసెంబరు 31కు ముందు నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని గతంలో కల్పించగా అప్పట్లో జిల్లాలోని పట్టణాల నుంచి 4,635 దరఖాస్తులొచ్చాయి. వాటి పరిష్కారంతో రూ.41 కోట్ల వరకు పురపాలికలకు ఆదాయం సమకూరింది. అక్రమ కట్టడాల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. బీపీఎస్‌లో వస్తున్న దరఖాస్తులు వేలాదిగా ఉంటుంటే ఇవేమీ పట్టించుకోకుండా నిర్మాణయ్యేవి రెట్టింపుగా ఉంటాయనే ఆరోపణలున్నాయి.
అక్రమ కట్టడాలను సక్రమం చేసుకోవడం ద్వారా పురపాలికలకు ఆదాయం సమకూరుతుంది. గతంలో ఒక్క భీమవరం పురపాలక సంఘానికే రూ.14 కోట్లకు పైగా వచ్చింది.భీమవరంలో 15, తణుకులో 35 దరఖాస్తులు గత నెలన్నర నుంచి అపరిష్కృతంగా ఉండిపోవడంపై పట్టణ ప్రణాళిక విభాగ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయని సమాచారం.
పరిష్కారంపై దృష్టి:
రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో ఇప్పటి వరకు 81 శాతం దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. మిగిలిన వాటినీ పరిష్కరింపజేసే దిశగా చర్యలు తీసుకున్నామని రాజమహేంద్రవరం పట్టణ ప్రణాళిక శాఖ ప్రాంతీయ సంచాలకులు, వై.పాండురంగనాయకులు తెలిపారు.
ఇదీ చదవండి: హక్కులు హరించేలా పోలీసు వ్యవస్థ తీరు ఉంది: వర్లరామయ్య