ETV Bharat / state

ఆలోచన అదిరింది.. సాంకేతికతతో కుదిరింది! - చేపల పెంపకంలో ఓఆర్​ఎస్ విధానం న్యూస్

ఆలోచన కొత్తగా ఉండాలేగాని.. ఎందులోనైనా రాణించొచ్చు. నూతనంగా ఏదైనా చేయాలనే తపన ఉంటే.. అద్భుతాలు సృష్టించొచ్చు. అలా అద్భుతమైన ఆలోచనతో చేపల పెంపకాన్ని స్మార్ట్​గా మార్చారు ఇంజినీరింగ్ విద్యార్థులు.

ఆలోచన అదిరింది... సాంకేతికతతో కుదిరింది!
ఆలోచన అదిరింది... సాంకేతికతతో కుదిరింది!
author img

By

Published : Jan 16, 2020, 7:03 AM IST

ఆలోచన అదిరింది... సాంకేతికతతో కుదిరింది!

సాధారణంగా ఎకరం చేపల చెరువులో రెండున్నర వేల చేప పిల్లల పెంపకం చేపడతారు. కానీ.. చిన్న ట్యాంకులో ఎనిమిదన్నర వేల చేప పిల్లల పెంపకాన్ని చేపడుతున్నారు ఇంజినీరింగ్ విద్యార్థులు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానంతో కాలుష్యంలేని చేపల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఆప్టిమల్ రీ సర్క్యులర్ సిస్టం (ఓఆర్ఎస్) గా పిలిచే ఈ విధానాన్ని కళాశాల ఆవరణంలోనే ఏర్పాటు చేసి.. పరిశోధనలు సాగిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం వట్లూరు రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు చేపల పెంపకంలో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఓఆర్ఎస్​గా ఈ విధానానికి నామకరణం చేశారు. తక్కువ విస్తీర్ణం, నీటితో చేపల పెంపకానికి శ్రీకారం చుట్టారు. కళాశాలకు చెందిన సుధీర్, కళ్యాణ్, కాళేష్, వెంకటేష్, యశ్వంత్ సాయి అనే విద్యార్థులు కలసి ఈ విధానం అమలు చేస్తున్నారు. కళాశాల ఆవరణలోనే ఈ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

నాలుగు సెంట్ల స్థలంలో 13 అడుగుల గోతి తవ్వారు. నీరు ఇంకిపోకుండా.. పాలిథిన్ కవర్ అమర్చారు. నాలుగు లక్షల లీటర్ల నీటిని ఇందులో నింపారు. నీటిని ఫిల్టర్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గాలిని పంపింగ్ చేసే.. బ్లోయర్ యంత్రాన్ని అమర్చారు. ఇందులో ఎనిమిదన్నర వేల చేపలను మూడునెలల కిందట వదిలారు. చేపలకు ఫ్లోటింగ్ ఫీడ్ అందిస్తున్నారు. నీటిని శుద్ధిచేసేందుకు ఫిల్టర్ 24గంటలు పనిచేస్తుంటుంది.

చేపలు అధికంగా ఉండటం వల్ల.. అమ్మోనియా పేరుకుపోయి చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే వాటి వ్యర్థాలను శుద్ధిచేసేందుకు ఫిల్టర్ విధానాన్ని అమర్చారు. తక్కువ నీరు ఉండటం, చేపలు అధికంగా ఉండటం వల్ల చేపలకు ఆక్సిజన్ అందడం కష్టంగా ఉంటుంది. అందుకోసమే.. గాలి బ్లోయర్ యంత్రాలు అమర్చి.. 13 అడుగుల లోతుకు గాలి చొరబడేలా.. చిన్న పైపులు ఏర్పాటు చేశారు. ఈ విధానం అమలు చేసేందుకు ఖర్చు సైతం తక్కువగా వచ్చిందని విద్యార్థులు అంటున్నారు. మూడు నెలల కిందట మూడు వందల గ్రాములు ఉన్న చేపపిల్లలు వదిలితే.. ప్రస్తుతం 7వందల గ్రామాల వరకు పెరిగాయని విద్యార్థులు చెబుతున్నారు.

రైతులు లక్షల రూపాయల మొత్తాన్ని భూములకు లీజులు కట్టి.. చేపల పెంపకాన్ని చేపట్టి నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొనే విద్యార్థులు.. ఓఆర్ఎస్ విధానానికి శ్రీకారం చుట్టారు. కేవలం నాలుగు సెంట్ల స్థలంలో నాలుగు ఎకరాల్లో చేపట్టే చేపల పెంపకాన్ని చేపడుతున్నారు. చిన్నకారు రైతులు సైతం తమ ఇంటి ఆవరణంలో ఈ చేపల పెంపకాన్ని చేపట్టే ఆస్కారం ఉందని తెలిపారు. రోజుకు కేవలం గంట సమయం కేటాయిస్తే.. చాలని విద్యార్థులు అంటున్నారు. ఫలితం వచ్చాక.. ఈ విధానాన్ని రైతులకు విస్తరించేందుకు విద్యార్థులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

పూజాహెగ్డే కోసం ఐదు రోజులు రోడ్డుపైనే

sample description

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.