Nara Lokesh Fire on Police: తనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీసుల్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గట్టిగా ప్రశ్నించారు. గత రాత్రి చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి లోకేశ్ కు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బేతపూడి క్యాంప్ సైట్ కు చేరుకున్నారు. పోలీసులు ఇచ్చిన నోటీసులు చదివిన ఆయన... వారికి ఎదురు ప్రశ్నలు సంధించారు. ఏ ఏ నిబంధనలు తాను ఉల్లంఘించానో సవివరంగా నోటీసు ఇవ్వాలంటూ పోలీసులకు కాపీని తిరిగి ఇచ్చేశారు. నిన్న దాడిచేసిన వారి ఫొటోలు మా వద్ద ఉన్నాయి.. వారిని అరెస్టు చేశారా అని లోకేశ్ ప్రశ్నించారు. కవ్వింపు చర్యలకు పాల్పడే ఫ్లెక్సీల సంస్కృతి ఇప్పుడే చూస్తున్నామని విమర్శించారు.
సీఎం పర్యటన ఉంటే చాలు.. గృహనిర్బంధం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ మిధున్‌రెడ్డి ఇక్కడికి ఎందుకు వచ్చారని నిలదీశారు. పాదయాత్రను భవనం పైనుంచి చూస్తున్న వారిపైనా రాళ్లు వేశారని లోకేశ్ ఆరోపించారు. ఇంకెందుకు.. తానేం మాట్లాడాలో డీజీపీ స్క్రిప్ట్ ఇస్తే అదే మాట్లాడతానంటూ మండిపడ్డారు. తానెక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదని స్పష్టం చేశారు. దాడులపై పోలీసులకు ముందే సమాచారమిస్తున్నా, వైసీపీ నాయకులు (YSRCP Leaders), కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటే పోలీసులు పట్టించుకోవట్లేదని ఆక్షేపించారు. కవ్వింపు చర్యలకు పాల్పడే వారికి పోలీసులే భద్రత కల్పిస్తున్నారని అన్నారు. తమ జోలికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని లోకేశ్ అన్నారు. ప్రజలు వచ్చి కలుస్తుంటే వారిని కలవకూడదా అని నిలదీశారు. ఏ జిల్లాలో జరగని అరాచకాలు ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. తన పాదయాత్రను శాంతియుతంగానే కొనసాగిస్తానని లోకేశ్ స్పష్టం చేశారు. తాము ఫిర్యాదులు చేసినా వాళ్లపై కేసులు నమోదు చేయట్లేదన్న నారా లోకేశ్.. కొంత మంది పోలీసుల తీరు వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని ఆరోపించారు.
తానెక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదని లోకేశ్ స్పష్టం చేశారు. దాడులపై పోలీసులకు ముందే సమాచారమిస్తున్నా పట్టించుకోవట్లేదన్న లోకేశ్.. కవ్వింపు చర్యలకు పాల్పడేవారికి పోలీసులే భద్రత కల్పిస్తున్నారని అన్నారు. అనుమతించిన మార్గంలోనే పాదయాత్ర చేస్తున్నామని, ప్రజలు వచ్చి కలుస్తుంటే వారిని కలవకూడదా? అని ప్రశ్నించారు. చట్టాలు ఉల్లంఘించాలనే కోరిక నా జీవితంలో ఉండదు.. మేమెప్పుడూ వైసీపీ నేతలను కించపరిచేలా మాట్లాడట్లేదని తెలిపారు. రాజ్యాంగం (constitution) ఇచ్చిన హక్కులనే వినియోగించుకుంటున్నాం.. పాదయాత్రను శాంతియుతంగా కొనసాగిస్తామని చెప్పారు. తనను కించపరిచేలా వైసీపీ వాళ్లు కార్టూన్లు వేస్తున్నారన్న లోకేశ్.. మాకు కూడా అనుమతించండి... మేం కూడా ఫ్లెక్సీలు వేస్తాం అని అన్నారు.
యువగళం ప్రజాగళంగా మారడాన్ని ఓర్చుకోలేకే అధికార పార్టీ దాడులను ప్రోత్సహిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు ఎందుకు అనుమతించారని ఆయన ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా బేతపూడి యువగళం క్యాంపుసైట్ వద్ద టీడీపీ నేతలు (TDP Leaders) మీడియాతో మాట్లాడారు. సీఎం సభలు, సమావేశాలకు టీడీపీ జెండాలతో వెళ్తే పోలీసులు ఊరుకుంటారా? అని నిమ్మల ప్రశ్నించారు. దాడులపై సమాచారమిచ్చినా పోలీసులు పట్టించుకోలేదని, అరెస్టు చేసిన వారిని ప్రైవేటు స్థలాలకు తీసుకెళ్లడం దుర్మార్గపు చర్య అని తీవ్ర స్థాయిలో ఖండించారు. పోలీసుల నిర్లక్ష్యం, ఏకపక్ష వైఖరితోనే వైసీపీ మూకల దాడి జరిగిందని తోట సీతారామలక్ష్మి అన్నారు. పాదయాత్రపై దాడి, వాలంటీర్ల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మంతెన రామరాజు మాట్లాడుతూ దాడిచేసిన వారిని కాకుండా, ప్రతిఘటించిన వారిపై వేధింపులా?... ప్రైవేటు స్థలాలకు తీసుకెళ్లడంపై పోలీసుల సమాధానమేంటి? అని ప్రశ్నించారు.
భీమవరం బేతపూడిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువ గళం (Yuvagalam) పాదయాత్ర పై వైసీపీ మూకల దాడిని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఖండించారు. ఏపీ పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని మండిపడ్డారు. శ్రుతి మించి పోతున్న వైసీపీ అరాచకాలకు పోలీసుల అండదండలందిస్తున్నారని ధ్వజమెత్తారు. రూట్ మ్యాప్ ఇచ్చినప్పటికీ పోలీసులు వైసీపీ గుండాలకు బందోబస్తు కల్పించి యువగళం పాదయాత్ర మీద దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం కాపాడాల్సిన పోలీసులు.. స్వార్థ ప్రయోజనాలకు తలొగ్గితే ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
Nara Lokesh Criticized CM Jagan: పేదలకు సెంటు స్థలం పేరుతో అవినీతికి పాల్పడ్డారు: నారా లోకేశ్