రాష్ట్రమంతా లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో ప్రజలు ఇళ్ల పట్టునే ఉంటున్నారు. సరఫరాలు పూర్తిగా స్తంభించిపోతే నిత్యవసరాలు ఎలా తీరతాయి? ప్రభుత్వం కూడా ఇదే ఆలోచించి కొన్ని అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే పరిశ్రమలకు మినహాయింపు ఇచ్చినట్లు పశ్చిమ గోదావరి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పి.ఏసుదాసు ప్రకటించారు.
నిత్యావసరాలు అంటే బియ్యం, పప్పుల మిల్లులు, పాల ఉత్పత్తులు, నీటిశుద్ధి ప్లాంట్లు, తాగునీటి పొట్లాలు, ఆహార ఉత్పత్తులు, బల్క్ డ్రగ్స్, శానిటైజర్లు, మాస్కుల తయారీ యూనిట్లు, పేపర్ న్యాప్‌కిన్లు, శానిటరీ న్యాప్‌కిన్లు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, బేకరీ, ఐస్ ప్లాంట్లు, ఫిష్ /పౌల్ట్రీ /కేటిల్ ఫీడ్ యూనిట్లు, ప్యాకేజింగ్, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆహారం, గ్రాసరీలను సరఫరా చేసే ఈ-కామర్స్ సంస్థలు, ట్రాన్స్‌పోర్టేషన్ ఆధారిత అత్యవసర సేవలు తదితర పరిశ్రమలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించారు. చేపలు / రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా తమ ఉత్పత్తులను కొనసాగించడానికి అనుమతి ఇచ్చారన్నారు.
కెమికల్, సిమెంట్, పంచదార, టెక్స్‌టైల్స్, ఫెర్టిలైజర్స్ తదితర పరిశ్రమలను కలెక్టర్ అనుమతితో కొనసాగించాల్సి ఉంటుందన్నారు. మినహాయింపు ఇచ్చిన పరిశ్రమల్లో తక్కువ సామర్థ్యంతో, స్కెలిటబుల్ స్టాఫ్‌తో మాత్రమే నిర్వహించాలని తెలిపారు. ఆయా పరిశ్రమల యాజమాన్యాలు లాక్‌డౌన్ కాలంలో తమ కార్మికులు / సిబ్బందికి తప్పనిసరిగా వేతనాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ కాలంలో పరిశ్రమలకు లే-ఆఫ్ ప్రకటించకూడదని పేర్కొన్నారు. పరిశ్రమల ఆవరణలో హ్యాండ్‌వాష్/ సబ్బు వంటివి అందుబాటులో ఉంచి శుభ్రత పాటించాలన్నారు. అదేవిధంగా కార్మికులు, సిబ్బంది రాకపోకలు సాగించేందుకు రవాణా సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: