పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అప్రజాస్వామిక విధానాలను అనుసరించిందని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో... జనసేన మద్దతుతో గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులతో పాలకొల్లులో సమావేశం నిర్వహించారు. పార్టీ తరఫున విజయం సాధించిన వారిని అభినందించారు.
పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా మహిళలు, యువత పోటీలో నిలిచి గెలుపొందారని నాదెండ్ల మనోహర్ అన్నారు. కొన్ని చోట్ల అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయామని, రీ- కౌంటింగ్ కోరినా చేపట్టలేదని ఆవేదన చెందారు. ఈ విషయాన్ని ఎస్ఈసీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. అనంతరం.. నరసాపురం పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల ఇన్ఛార్జులు, నాయకులతో నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
కుల రాజకీయాలు తీసుకు వచ్చింది ముఖ్యమంత్రే...
రాజకీయాల్లోకి కులాల ప్రస్తావన తీసుకొచ్చింది ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన పార్టీని కాపుల పార్టీగా ముద్ర వేయడం తగదన్నారు. కార్పోరేషన్ పేరుతో కులాలను విడదీసి ఎన్నికల్లో లబ్ధి పొందారని అన్నారు.
ఇదీ చదవండి:
ముగిసిన నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు.. 82.85 శాతం పోలింగ్ నమోదు