పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని సబిహ ట్రేడర్స్ రైస్ మిల్లు వద్ద 250 టన్నుల పీడీఎస్ బియ్యం నిల్వలను విజిలెన్స్ అధికారులు గురువారం గుర్తించారు. తమకు అందిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించినట్లు తణుకు విజిలెన్స్ ఏఎస్‌వో నారాయణ తెలిపారు. మిల్లు వద్ద ఎటువంటి నివాసాలు లేకున్నా బియ్యం నిల్వలు ఎవరూ గుర్తించకుండా.. కరోనా కేసులు ఉన్నట్లు రెడ్‌జోన్ బ్యానరును మిల్లు నిర్వాహకుడు ఎస్.బాషా సొంతగా ఏర్పాటు చేశాడు. ఆ దారి వెంట బ్లీచింగ్ చల్లించాడు.
ఏఎస్‌వో నారాయణ, విజిలెన్స్ తహసీల్దార్ రవికుమార్‌లు మిల్లు వద్ద గిడ్డంగిలో, ఆరుబయట నిల్వ ఉంచిన బియ్యం బస్తాల వివరాలను నమోదు చేసి సీజ్ చేశారు. నిర్వాహకుడు బాషా అందుబాటులో లేకపోవటంతో వీఆర్వోలు, ఇతర అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని నివేదిక రూపొందించారు. అక్రమంగా బియ్యం నిల్వ ఉంచిన బాషాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్‌వో నారాయణ తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్ : ముడిసరకు కొరత.. కార్మికులు దొరక్క తిప్పలు