Useless fields: పంట పొలాల్లోని నీటిని బయటకు పంపేందుకు వినియోగించే డ్రెయిన్లు, కాలువల నిర్వహణను ప్రభుత్వ యంత్రాంగం గాలికి వదిలేయడంతో రెండు పంటలు పండే భూములను సైతం రైతులు బీడుపెడుతున్నారు. పొలాల్లో చేరిన నీరు బయటకు కదిలే మార్గం లేకపోవడంతో వందల ఎకరాల సొంత భూములు అక్కరకు రాకుండా పోతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు అతి కష్టం మీద ఒక పంట పండించుకునే రైతన్నలకు ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. సాగుకు యోగ్యం కాదని కనీసం చేపల చెరువులు తవ్వుకునేందుకైనా అనుమతి ఇవ్వాలని అధికారులకు మొరపెట్టుకుంటే ఆ ప్రక్రియా ముందుకు కదలడం లేదు. దీంతో రైతుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.
చూస్తూ చూస్తూ రెండు పంటలు పండే పొలాన్ని ఎవరైనా బీడు పెట్టుకుంటారా కానీ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఆరేడులో ఇదే జరుగుతోంది. ఆరేడు ఆయకట్టులో సుమారు 130 ఎకరాలకు పైగా భూములను రైతులు నిరుపయోగంగా వదిలేశారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఆరేడు ఆయకట్టులోని ఈ 130 ఎకరాల భూమిలో 2020లో కురిసిన భారీ వర్షం కారణంగా నీళ్లు చేరాయి. అయితే డ్రెయిన్లు, కాలువలు సరిగా లేకపోడవంతో ఆ ఏడాది నెలల తరబడి నీళ్లు అలాగే నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఏటా వర్షాకాలంలో నీళ్లు చేరడం అవి అలాగే ఉండిపోవడం జరుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా అప్పట్లో రైతులే స్వయంగా నడుం బిగించి కొంత వరకు కాలువలు, డ్రెయిన్లలో పూడిక తీసుకున్నా ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చినా ఫలితం లేకపోవడంతో సొంత పొలాలు ఉన్నా పండే వీలులేదని రైతులు చెబుతున్నారు.
రెండేళ్ల క్రితం వరకు మొదటి పంటగా సార్వా సాగు చేసిన రైతన్నలు అంతో ఇంతో ధాన్యాన్ని పండించగా ఇప్పుడు ఏడాది పొడవునా నీళ్లు నిలిచే ఉండటంతో రెండు పంటలు కోల్పోతున్నారు. ఆరేడులోని ఈ ఆయకట్టు సాగుకు అనువు కాదని వ్యవసాయ శాఖ అధికారులు తేల్చి చెప్పినా రైతులకు మరో ప్రత్యామ్నాయం మాత్రం చూపలేదు. దీంతో రైతులు ఎటూ పాలుపోని స్థితిలో పంట పొలాలను బీళ్లుగా మార్చుకుంటున్నారు. సాగుకు అనుకూలం కాదని అధికారులు తేల్చేయడంతో కనీసం చెరువులు తవ్వుకునేందుకైనా అనుమతులు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇందుకోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నా అనుమతులు మంజూరు చేయడంలో తాత్సారం చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. చెరువుల తవ్వకానికి సంబంధించి అటు రెవెన్యూ, వ్యవసాయ, విద్యుత్, మత్స్యశాఖల నుంచి నిరభ్యంతర పత్రం రావాలని ఆయా శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో తాము దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు.
ఆరేడు ఆయకట్టుకు పక్కనే ఇలాంటి పరిస్థితి ఉన్న పంటపొలాలను ఇప్పటికే చేపల చెరువుల కింద మార్చుకుని రైతులు సాగుచేసుకుంటుండగా వీరికి మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. పంట పొలాల్లోని నీటిని బయటకు పంపేందుకు డ్రెయిన్లు, పంటకాలువల నిర్వహణ సరిగా ఉంటే తమకు ఎలాంటి సమస్య ఉండేది కాదని ఇప్పుడు అటు పొలం పండక ఇటు చెరువులకూ అనుమతి రాక తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని రైతులు వాపోతున్నారు.
ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి డ్రెయిన్లు శుభ్రం చేయడమో లేక చెరువులు తవ్వేందుకు అనుమతులు త్వరిత గతిన మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: