పశ్చిమ గోదావరి జిల్లా... ఉద్యాన సాగుకు పెట్టింది పేరు. రాష్ట్రంలోనే అన్ని రకాల పంటలకు అనువైన జిల్లాగా పేరొందింది. ఉద్యాన పంటలను నూతన పద్ధతుల్లో సాగు చేస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీలను అందిపుచ్చుకుంటూ నూతన ఒరవడిని రైతులు సృష్టిస్తున్నారు. టమాటా, క్యాప్సికం, వంగ, మిరప, కీరదోస, చామంతి, బంతి లిల్లీ.. ఇలా పలు రకాల ఉద్యాన పంటలు పండిస్తున్నారు. అయితే.. ఏడాది కాలంగా రాయితీలు అందక ఉద్యాన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అప్పులు తప్ప లాభాలు లేవు
కరోనా ప్రభావం, లాక్డౌన్ నేపథ్యంలో పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం ఒక వంతైతే.. ప్రభుత్వాల నుంచి రావాల్సిన రాయితీలు సైతం అందక పలు చోట్ల కర్షకులు సాగుకు విరామం పలుకుతున్నారు. పెట్టుబడి సైతం రాక అప్పుల పాలయ్యామని రైతులు ఆవేదన చెందుతున్నారు.
రాయితీ బకాయిలు కోట్లలోనే..
జిల్లాలో జంగారెడ్డిగూడెం, చింతలపూడి, పోలవరం, కొవ్వూరు, ఏలూరు, దెందులూరు, గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. రైతులను ప్రోత్సహించేందుకు గతంలో ఉద్యాన శాఖ అధికారులు షేడ్ నెట్, పాలీహౌస్లను రాయితీలతో అందించారు. అయితే గత ఏడాది కాలంగా తమకు అందాల్సిన రాయితీ బకాయిలు రూ.60 కోట్ల మేర పేరుకుపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వీటి కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా.. ఫలితం లేకపోతోందంటూ వాపోయారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి
ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి రాయితీలు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. లేకుంటే పంటలు సాగు చేసే పరిస్థితి లేదని వాపోతున్నారు.
ఇదీ చూడండి: