AP High court: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని 29వ వార్డులో... ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలంలో కంపోస్ట్ యార్డ్ నిర్మాణం వద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా పనులు కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు హెచ్చరించింది. ఆ విషయాన్ని అధికారులకు తెలియజేయాలని అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ సూచించింది. ఉల్లంఘనలను ఉపేక్షించబోమని తేల్చిచెప్పింది. విచారణకు హాజరైన పురపాలక కమిషనర్, డైరెక్టర్ ఎం.మల్లిఖార్జుననాయక్, భీమవరం మున్సిపాలిటీ కమిషనర్ ఎం.శ్యామల, నర్సాపూర్ నబ్ కలెక్టర్ సి.విష్ణుచరణ్పై ప్రశ్నలు సంధించింది. కోర్టు ఆదేశాలతో నిర్మాణ పనులను నిలిపేస్తే పిటిషనర్ కోర్టుధిక్కరణ వ్యాజ్యం ఎందుకు వేస్తారని నిలదీసింది.
అధికారుల తీరుతో తాము సంతోషంగా లేమని వ్యాఖ్యానించింది . నిర్మాణానికి సంబంధించిన మెజర్‌మెంట్స్ పుస్తకంతో పాటు ఇతర రికార్డులను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. కోర్టు ఆదేశం తర్వాత కాంట్రాక్టర్, కూలీలకు అధికారులు ఎలాంటి చెల్లింపులు జరపలేదని పేర్కొంటూ అఫిడవిట్ చేయాలని స్పష్టంచేసింది. అధికారులను తదుపరి విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 7కు వాయిదా వేసింది . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. లేఅవుట్ ప్రకారం ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలంలో కంపోస్ట్ యార్డ్ నిర్మిస్తున్నారంటూ సి.సత్యనారాయణ, మరొకరు హైకోర్టులో పిల్ వేశారు. ఈ ఏడాది జనవరి 27 న విచారణ జరిపిన కోర్టు.. నిర్మాణ పనులను నిలిపేసింది.
కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ పనులు కొనసాగిస్తున్నారని అధికారులపై సిటిషనర్లు కోర్టుధిక్కరణ వ్యాఖ్యం వేశారు. ఇటీవల విచారణ చేసిన ధర్మాసనం.. ముగ్గురు అధికారులు హాజరుకు ఆదేశించింది. దీంతో వారు హైకోర్టుకు హాజరయ్యారు. జనవరి 27 న కోర్టు ఇచ్చిన ఆదేశాలతో 20 నుంచి పనులను నిలిపేశామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చినప్పటికీ పనులు కొనసాగించారని పిటిషనర్ల తరపు న్యాయవాది కె.చిదంబరం వాదనలు వినిపించారు. దీంతో అధికారుల తీరుపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ఉపేక్షించేంది లేదని తీవ్రంగా హెచ్చరించింది. రికార్డులను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: వెంకట్రావు పిటిషన్‌పై.. కలెక్టర్ ఆదేశాలు సస్పెండ్ చేసిన హైకోర్టు