గోదావరిలో దూకి ఓ కుటుంబం తమ ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగించింది. ఇద్దరు పిల్లలతోపాటు భార్యాభర్త బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన.. బాధితుల బంధువులను పెనువిషాదంలో ముంచేసింది.
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురుకు చెందిన సతీష్, సంధ్య..తమ ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వద్ద గోదావరి నదిలో దూకేశారు. తొలుత చిన్నారులు జస్విన్, బిందుశ్రీని నదిలోకి తోసేసి.. ఆ తర్వాత వాళ్లు కూడా దూకారు. ప్రవాహంలో కొట్టుకుపోయిన సతీష్‌తోపాటు రెండేళ్ల చిన్నారి బిందుశ్రీ మృతదేహాలను.. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం వద్ద కనుగొన్నారు. మిగిలిన వాళ్ల కోసం గాలిస్తున్నారు.
ఫణీంద్ర అనే వ్యక్తితో బంధువులతో కలిసి మోసం చేయడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు.. సంధ్య రాసిన సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది. వారుచేసిన మోసంతో మానసిక క్షోభకు గురై.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకుని.. దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
సతీష్, సంధ్య తమ ఇద్దరు పిల్లలతో కలిసి.. శనివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం వెలువెల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. రోజంతా అక్కడే గడిపారు. అనంతరం బంధువుల ఇంటి నుంచి బయలుదేరారు. ఎంతకీ సొంతూరికి చేరుకోకపోవడంతో.. పాలకొల్లు పోలీసు స్టేషన్లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆదివారం చించినాడ వంతెనపై అనుమానాస్పదంగా ఉన్న బైక్‌ను గుర్తించారు. నలుగురూ నదిలో దూకినట్లు భావించి గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు.
చించినాడ వంతెన వద్ద లేఖ
తమ కుటుంబ సభ్యులే తమను మోసం చేశారని.. ఈ కారణంగా తన భర్త పిల్లలతో చనిపోతున్నట్లు దంపతుల్లోని భార్య పేరిట ఉన్న ఓ ఆడియోను పోలీసులు గుర్తించారు. అలాగే.. ఓ లేఖను సైతం వారు ఘటనా స్థలం వద్ద గమనించి.. స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: