డిసెంబరు మొదటి వారంలో నారుమళ్లు వేసి చివరి వారంలో నాట్లు పూర్తిచేసి, మార్చి 31వ తేదీ నాటికి కోతలు పూర్తి చేయాలి అనేది ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళిక. డిసెంబర్ నెలలో సగం రోజులు గడిచినప్పటికీ ఇప్పటికి 70 నుంచి 72 శాతం మాత్రమే నారుమళ్లు పూర్తయినట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో 4 లక్షల 60 వేల ఎకరాల్లో రబీ పండిస్తారు. ఇందుకోసం సుమారు 19 వేల ఎకరాల్లో వేయాల్సి ఉండగా 14 వేల ఎకరాల్లో మాత్రమే పూర్తయినట్లు చెబుతున్నారు. విస్తీర్ణంలో విత్తనాలు వెదజల్లు కోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రబీ పంటలో 120 రోజుల్లో పంటలు చేతికొచ్చే వంగడాలు అందుబాటులో లేవని రైతులు అంటున్నారు. 1121 సైతం పండించడానికి 130 రోజులు కాల పరిమితి అవసరమవుతుందని అంటున్నారు. పంట చివరి దశలో నీరు అందుబాటులో లేకపోతే దిగుబడులు తగ్గిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందువల్ల ఏప్రిల్ 15వ తేదీ వరకు నీటిని విడుదల చేసి తమని కాపాడాలని రైతులు కోరుతున్నారు.
120 రోజుల కాలపరిమితిలో రబీ పంట పూర్తిచేయాలని ప్రభుత్వం ప్రకటించినా.. రైతులను ఆ దిశగా అవగాహన పరిచేందుకు వ్యవసాయ శాఖ తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. 120 రోజుల్లో పంట పూర్తి చేసేందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టకపోవడం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఎకరానికి ఎన్ని కిలోల విత్తనాలు వెదజల్లాలి ఎన్ని మొక్కలు మొలకెత్తుతాయి. ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలనే అంశాలపై శాస్త్రవేత్తలు గాని వ్యవసాయ అధికారులు గాని చెప్పడం లేదు అంటూ రైతులు విమర్శిస్తున్నారు. పంట కాలంలో అధిక వర్షాలు... తుపాన్ల వల్ల నష్టపోయిన తమని ఆదుకోవాలని ఏప్రిల్ 15 వరకు నిలిచిన పంట పండించడానికి అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టివేత.. రూ.1.9 కోట్లు స్వాధీనం