ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో నిజ ఆశ్వయుజ మాస తిరు కల్యాణోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు వచ్చే నెల 2 వరకు ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటిరోజు స్వామి, అమ్మవార్లను పెళ్లికుమారుడు, పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేశారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో స్వామి, అమ్మవార్లను ఉంచి ప్రత్యేక పూలతో అలంకరించారు. హారతులు పట్టి అర్చకులు శాస్త్రోక్తంగా వేడుక నిర్వహించారు.
ఈ ఉత్సవంలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, ఆలయ ఛైర్మన్ ఎస్వీ సుధాకర్, ఈవో భ్రమరాంబ పాల్గొని అనంతరం స్వామివారిని దర్శించారు. 27న రాత్రి కళ్యాణోత్సవాల వీక్షణకు సర్వాది దేవతలను ఆహ్వానించే క్రమంలో ధ్వజారోహణ, 29న ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. 30వ తేదీ రాత్రి 9 గంటలకు స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవం జరుగుతుంది. వచ్చే నెల 1న చక్రస్నానం, ధ్వజావరోహణ, 2న రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీ పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి. కరోనా కారణంగా బ్రహ్మోత్సవాల్లో జరిగే స్వామివారి వాహన సేవలు ఆలయ ప్రాంగణం లోపల ఏకాంతంగా నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి..