పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్ర దేవతగా కొనియాడబడుతున్న కుంకుళ్ళమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. మొదటిరోజు ఆలయ ముఖ మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు కుంకుమ పూజలు, 9 గంటలకు చండీహోమం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారు విశేష అలంకారాలలో భాగంగా శ్రీ మహా రేణుకా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. విశేష అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించి తరించారు.
ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక భక్తుడు రూ. 20 లక్షలు విలువైన బంగారు కిరీటాన్ని బహుమతిగా అందించాడు. గణపవరం మండలం వల్లూరు గ్రామానికి చెందిన రుద్రరాజు సీతారామరాజు , సరోజిని దంపతులు ఈ కిరీటాన్ని ఆలయ ఈవో డి.భ్రమరాంబకు అందించారు. 435 గ్రాముల బరువైన ఈ బంగారు కిరీటాన్ని303 రాళ్ళు పొదిగి తయారు చేయించినట్లు దాత సీతారామరాజు పేర్కొన్నారు. అంతరాలయంలో కొలువైన ద్విమూర్తుల్లో పెద్ద స్వామికి ఈ కిరీటాన్ని అలంకరించాలని దాత కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా దాత కుటుంబానికి ఆలయ అధికారులు శ్రీవారి దర్శనాన్ని కల్పించి.. అనంతరం స్వామివారి శేష వస్త్రాన్ని, ప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: దేశంలో 62 వేల కొత్త కేసులు.. 837 మరణాలు