పశ్చిమగోదావరి జిల్లా డెల్టాలో వరదనీరు పంటపొలాలను ముంచెంతకుండా నియంత్రించడానికి డ్రెయిన్ వ్యవస్థకు అప్పట్లోనే బ్రిటిషర్లు రూపకల్పన చేశారు. గోదావరి డెల్టాలో పలు ప్రాంతాల్లోని వరద నీటిని సముద్రంలో చేర్చడానికి ఈ డ్రెయిన్లే ప్రధాన ఆధారం. తుఫాన్ల సమయంలో డెల్టా పంటపొలాలు మునిగిపోకుండా... వరదనీటి మురుగుకాలువలే కాపాడుతున్నాయి. అలాంటి డ్రెయిన్ల మరమ్మతుల పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు.
జిల్లాలో ఈ ఏడాది డెల్టాలోని పలు ప్రాంతాల్లో మురుగునీటి కాలువల మరమ్మతులు చేస్తున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు కేటాయించారు. నామినేటెడ్ పద్ధతిలో పనులు గుత్తేదారులకు కేటాయిస్తున్నారు. పరోక్షంగా ఆయా నియోజవర్గస్థాయి ప్రధాన ప్రజాప్రతినిధులు ఈ పనులు చేపడుతున్నారు. మధ్యలో తమ పేరు బయటకు రాకుండా బినామీలను గుత్తేదారులుగా ఉంచుతున్నారని సమాచారం.
ఏలూరు గ్రామీణం, దెందలూరు మండలాల్లోని మొండికోడు, జాలీపూడి డ్రైన్ల మరమ్మతులను ఇటీవల చేపట్టారు. దాదాపు ఆరు కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభించారు. మొండికోడు డ్రైన్‌ను 9.7కిలోమీటర్లు మరమ్మతు చేశారు. ఈ మురుగు నీటి కాలువలో పూడిపోయిన మట్టిని తీసి శభ్రం చేయాలి. డ్రైన్ అంచుల్లో మట్టి జారిపోకుండా జాగ్రత్తలు చేపట్టాలి. కాగా మొండికోడు డ్రెయిన్ మరమ్మతుల్లో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దెందులూరు మండలం కొవ్వలి సమీపంలో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర పూడికమట్టి తీసి.. అంచులకు వేశారు. వేసిన రెండు రోజులకే మట్టి జారిపోయింది. పనులు తొందరగా చేపట్టాలన్న హడావుడి... తవ్వే యంత్రాలకు అద్దె అధికంగా చెల్లించాలన్న స్వార్థప్రయోజనంతో పూడికను అక్కడే వేస్తున్నారు. ఈ పనుల వల్ల.. రెండు మూడు వర్షాలకు డ్రెయిన్ పూడికతో నిండిపోతుందని రైతులు అంటున్నారు.
జిల్లాలో కురిసే భారీ వర్షాలకు ఏటా డ్రెయిన్లు పూడికతో నిండిపోతున్నాయి. ఎగువున మట్టి కొట్టుకువచ్చి.. డ్రెయిన్లలో నిలిచిపోతోంది. ఈ కారణంగా ఎప్పటికప్పుడు డ్రెయిన్లను పూడిక తీయాల్సి వస్తోంది. ఎగువున ఉన్న మట్టి కొట్టుకురావడమే కాకుండా..అంచుల్లో మట్టి విరిగిపడుతోంది. ఈ కారణంగానే వరద మురుగునీటి కాలువలు తొందరగా పూడికతో నిండిపోతున్నాయి. తపాన్లు, వరద సమయంలో నీరు వెళ్లకుండా పొలాలపైకి వస్తోంది. దీనివల్లే పంటపొలాలు నీటమునిగిపోతున్నాయి.
ఈ ఏడాది ప్రజాప్రతినిధులు గుత్తేదారులుగా అవతారం ఎత్తడం వల్ల.. పనుల్లో నాణ్యత లోపించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హడావుడిగా పనులు చేయడం వల్ల.. డ్రెయిన్ల మట్టి అంచులు విరిగిపడ్డాయి. ఒక్కో ప్రాంతంలో పనులకు 20నుంచి 30వరుకు తవ్వే యంత్రాలు వాడుతున్నారు. సాధారణంగా పనులు వేసవిలో చేపట్టాలి. జూన్ రెండో వారం నుంచి వర్షాలు పడే సీజన్లో పనులు ప్రారంభించారు. వర్షాలు వస్తాయన్న కారణంగా హడావుడిగా పనులు చేపట్టారు.డ్రెయిన్ల పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చే గుత్తేదాలపై చర్యలు చేపట్టి.. పనులు నాణ్యతగా జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.