Chandrababu Convoy Issue : జడ్‌ప్లస్ భద్రత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో భద్రతా లోపాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా సీఎం కాన్వాయ్‌లో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. బుధవారం నాడు ఉదయం గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వచ్చారు. ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఓ గుర్తుతెలియని వాహనం అడ్డంగా పార్క్ చేసి ఉండటం కలకలం రేపింది. తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన కియా కార్నివాల్ కారును ఎవరో పార్టీ కార్యాలయం గేటు ఎదుట అడ్డుపెట్టి, తాళం వేసి వెళ్లిపోయారు.
ముఖ్యమంత్రి పర్యటన ఉదంటే వందల మంది పోలీసులను మోహరిస్తారు. అంతమంది ఉన్నా రోడ్డుకు అడ్డుగా కారును పార్క్ చేసి వెళ్లిపోయినా ఎవరూ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆ వాహనం ఎవరిదో తొలగించాలని అరగంట పాటు భద్రతా సిబ్బంది మైకులో ప్రకటించినా ఎవరూ రాలేదు. దాన్ని అక్కడి నుంచి తొలగించాలని పోలీసులు ప్రయత్నించినా సరైన టోయింగ్ వాహనం ఒక్కటీ కూడా లేకపోవడం విస్మయానికి గురిచేసింది.
మరోవైపు చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిపోయే సమయం కావడంతో పోలీసులు ఒక టోయింగ్ వాహనాన్ని తెప్పించారు. దాంతో కారును తొలగించే యత్నం చేసి విఫలమయ్యారు. ఇంతలో ముఖ్యమంత్రి కాన్వాయ్‌నే కొద్దిసేపు ఆపాల్సి వచ్చింది. చివరికి ఆ కారు చుట్టూ బారికేడ్లు పెట్టి చంద్రబాబు కాన్వాయ్‌ను దాని పక్క నుంచే పంపారు. అసలు ఆ వాహనం ఎవరిదీ? అరగంట పాటు మైక్‌లో ప్రకటించినా ఎందుకు తొలగించలేదు? కాన్వాయ్ మార్గంలో అడ్డుగా నిలుపుతుంటే భద్రతా సిబ్బంది ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Security defects: భద్రతాలోపం.. చంద్రబాబు కాన్వాయ్‌లోకి చొచ్చుకొచ్చిన వైసీపీ వాహనాలు