పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ సంస్థ కార్యదర్శి డాక్టర్ త్రిలోచన్ మొహపాత్ర వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. 2018 నుంచి 2020 విద్యా సంవత్సరాల్లో విద్యనభ్యసించిన.. 635 మంది హానర్స్ హార్టికల్చర్, ఎంఎస్సీ, బీహెచ్డీ విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. అవసరాలకు అనుగుణంగా ఆయా పంటలపై పరిశోధనలు జరిపేందుకు.. శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలని త్రిలోచన్ మొహపాత్ర పేర్కొన్నారు.
దేశానికి ఉద్యాన పంటల ఉత్పత్తులను అందించడంలో వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన పాత్ర పోషిస్తోందని.. ఆ విశ్వవిద్యాలయం ఉపకులపతి జానకిరామ్ అన్నారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేసి.. రైతులు, నవీన పారిశ్రామికవేత్తలకు సహాయపడేలా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్జీరంగా, వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల ఉపకులపతులు విష్ణువర్ధన్ రెడ్డి, పద్మనాభరెడ్డిలు పాల్గొన్నారు.