Electric Shock: బుడి బుడి అడుగులతో ఇళ్లంతా కలియ తిరిగి ఆ చిన్నారి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. తల్లి కొంగుపట్టుకుని మురిపెంగా ఇంటి పైకి వెళ్లిన చిన్నారి దర్శిత్‌కు అవే చివరి అడుగులయ్యాయి. విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడిన చిన్నారి రెండు కాళ్లు తొలగించాల్సి వచ్చింది. ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని కలల కంటున్న ఆ తల్లిదండ్రులకు.. ఇక తమ ముద్దుల కుమారుడు నడవలేడని తెలిసి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టకు చెందిన జొన్నకూటి వినోద్, చాందిని దంపతులకు ఇద్దరు కుమారులు. ఈ నెల 12న ఇంటిపై బట్టలు ఆరవేసేందుకు చాందిని వెళ్లగా.. ఆమె వెనకాలే మూడేళ్ల దర్శిత్ కూడా వెళ్లాడు. డాబాపై ఆడుకుంటున్న దర్శిత్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. తల్లి పనిలో నిమగ్నమై ఉండగా దర్శిత్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడిన దర్శిత్‌ను తల్లి హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాళ్లు, చేతులు పూర్తిగా కాలిపోవడంతో తీవ్ర ఇన్‌ఫెక్షన్ సోకిందని వైద్యులు తెలిపారు. చిన్నారి దర్శిత్ రెండు కాళ్లను వైద్యులు తొలగించారు. పసివాడు ఇంకా ప్రాణాపాయం నుంచి బయటపడలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
"హై టెన్షన్ వైర్లు మా ఇంటిపై నుంచి ఉన్నాయి. అవి తగిలి నా బిడ్డకు షాక్ కొట్టడంతో రెండు కాళ్లను వైద్యులు తొలిగించారు. నయం కాకపోతే ఇంకా పైకి తొలగించాల్సి రావచ్చని అంటున్నారు. వైర్లను తొలగించమని అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు." -చాందిని, దర్శిత్ తల్లి
ఇంటి పైనుంచి వెళ్తున్న 33 కేవీ వైర్లు తొలగించాలని వినోద్ కుటుంబం 15 ఏళ్లుగా పోరాటం చేస్తోంది. విద్యుత్‌శాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. పట్టించుకోకపోవడం వల్లే తమ బిడ్డ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని తండ్రి వినోద్ కన్నీటి పర్యంతమయ్యారు.
"ఇంటిపై నుంచి ఉన్న విద్యుత్ వైర్లను తొలగించాలని నేను తిరగని కార్యాలయం లేదు. మా నాన్న హయాంలోనుంచి తిరుగుతున్నాం. విద్యుత్, రెవెన్యూ అధికారులకు ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు. మంత్రి తానేటి వనితకు వినతి పత్రం ఇవ్వగా.. ఆమె వైర్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికి తీయలేదు." - వినోద్, దర్శిత్ తండ్రి
రోడ్డు పక్కన వేయాల్సిన 33 కేవీ విద్యుత్ వైర్లను.. అక్కడ ఉన్న పెట్రోలు బంక్ యజమానితో అధికారులు కుమ్మక్కై తమ ఇళ్లమీదుగా వేశారని బాధితులు వాపోయారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డకు పుట్టెడు కష్టమొచ్చి తాము బాధల్లో ఉంటే.. ఘటనలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం లేదని రాసివ్వాలని పోలీసులు తమనే బెదిరిస్తున్నారని బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం చేయించే స్థోమత తమకు లేదని.. ప్రభుత్వమే ఆదుకుని తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: