కార్తిక మాసం చివరి సోమవారం కావటంతో పశ్చిమగోదావరి జిల్లాలో శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. ఉండ్రాజవరంలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన గోకర్ణేశ్వరస్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. 11వ శతాబ్దం రాజరాజనరేంద్రుని కాలం నుంచి ఈ ఆలయం ఉన్నట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. పరమశివుడికి ప్రీతిపాత్రం కార్తిక మాస పర్వదినాల్లో సోమవారం రోజు బోళా శంకరుడుని దర్శించుకుంటే సర్వ శుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతారు.
ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా దేవస్థాన పాలకవర్గం అధికారులు భక్తులకు సదుపాయాలు ఏర్పాటు చేశారు.
మోపిదేవి మండలంలో సోమావతి అమావాస్య సందర్భంగా శివారాధన చేస్తున్నారు. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయన్నారు. భక్తులు రావి చెట్టుకు పూజలు చేస్తున్నారు.
మాస శివరాత్రి సందర్భంగా ద్వారకాతిరుమల శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ,పంచామృత అభిషేకాలు జరిపించారు.
ఇదీ చదవండి: పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం జగన్