పశ్చిమ గోదావరి జిల్లాలో మూడేళ్లుగా వరదలకు... రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. తుపాన్లు, అల్పపీడనాల సమయంలో కురిసే భారీ వర్షాలకు.. డెల్టాలోని వరి పొలాలు నీటమునిగి ఏటా ముంపు ముప్పు తప్పడం లేదు. గోదావరి డెల్టాలో చిన్నాపెద్దా కలిపి సుమారు 78 మురుగు కాలువలు ఉన్నాయి. వేల కిలో మీటర్లు విస్తరించిన ఈ మురుగుకాల్వల్లో మూడేళ్లుగా నిర్వహణ కొరవడింది. డ్రెయిన్లలో పూడిక తీయకపోవడంతో.. గుర్రపు డెక్క, నాచు, మట్టి, చెత్తాచెదారం పేరుకుపోయి.. వరద నీరు పొలాల్లోనే ఉండిపోతోంది. ఏటా సుమారు 95వేల ఎకరాల్లో పొలాలు నీటమునిగి రైతులు నష్టపోతున్నారు.
జిల్లాలో చిన్నకాపవరం, నక్కల, యనపదుర్రు, ఉప్పుటేరు, దర్భరేవు, ఎర్రకాలువ వంటి ప్రధాన డ్రెయిన్లు ఉన్నాయి. మూడేళ్ల క్రితం.. ఒక్కో డ్రెయిన్ సుమారు 10వేల క్యూసెక్కుల వరద నీటిని తీసుకెళ్లగలిగే సామర్థ్యంతో ఉండేవి. వాటి ద్వారా ప్రస్తుతం 5వేల క్యూసెక్కుల వరద నీరు వెళ్లడమే కష్టంగా ఉందని రైతులు అంటున్నారు. డ్రెయిన్ల మరమ్మతు, పర్యవేక్షణకు నిధులు విడుదల కాక.. పూడిక, గుర్రపుడెక్కతో నిండిపోయి.. డెల్టాకు వరద ముంపును తెస్తున్నాయంటున్నారు.
జిల్లాలో సుమారు 5లక్షల ఎకరాల్లో గోదావరి డెల్టా విస్తరించింది. ఎగువన కురిసిన వర్షాలతోపాటు... డెల్టాలో పడిన ప్రతి చినుకు డ్రెయిన్ల ద్వారా సముద్రంలో కలవాలి. సుమారు 130కిలోమీటర్లు ఉన్న యనపదుర్రు డ్రెయిన్ పూడికతో నిండిపోయింది. జూన్‌లో కురిసిన వర్షాలకు.. డ్రెయిన్ పొంగి 40వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఉప్పుటేరు సామర్థ్యం.. 50వేల క్యూసెక్కుల నుంచి 15వేల క్యూసెక్కులకు పడిపోయింది. పూడికకు తోడు.. ఆక్రమణల వల్లే.. మురుగుకాల్వలు కుంచించుకుపోతున్నాయని రైతులు అంటున్నారు. వరద వల్ల ఏటా లక్షా 20వేల ఎకరాల ఆయకట్టుపై ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి.. డెల్టాలోని డ్రెయిన్లకు మరమ్మతు చేయాలని రైతులు కోరుతున్నారు. కాలువల్లో పూడిక, గుర్రపు డెక్కను తొలగించి వరద ముప్పు నుంచి తప్పించాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండీ.. నందమూరి హరికృష్ణకు చంద్రబాబు, లోకేశ్ నివాళి