పశ్చిమగోదావరి జిల్లా తణుకు పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. పట్టణంతో పాటు చుట్టూ ఉన్న పరిసర గ్రామాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
కరోనా వైరస్ ప్రారంభదశలో సుమారుగా 50 రోజులపాటు తణుకు పట్నంలోగాని పరిసర ప్రాంతాల్లో గాని ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వల్ల పాజిటివ్ కేసుల నమోదు ప్రారంభం అయింది... క్రమేణా స్థానికులకూ మహమ్మారి సోకడంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. తణుకుతో పాటు అత్తిలి, ఇరగవరం, ఉండ్రాజవరం, నిడదవోలు, పెరవలి మండలాల్లోని గ్రామాల్లో సైతం కేసులు నమోదయ్యాయి.
తణుకు మండలంలోని ఒక గ్రామంలో పెళ్లి దుస్తుల కోసం విజయవాడ వస్త్ర దుకాణానికి వెళ్లిన ఇద్దరికీ, వారితో పాటు వెళ్లిన అత్తిలి మండలానికి చెందిన ముగ్గురికి పాజిటివ్ రావడంతో ఆయా గ్రామాల్లో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వీరికి కరోనా సోకిన తర్వాత.. కొద్దిరోజుల్లో పెళ్లి కావలసిన వధువుకి సైతం పాజిటివ్ రావడం మరింత భయాన్ని పెంచింది. అధికారులు అప్రమత్తమై పాజిటివ్ నమోదైన గ్రామాలలో శానిటేషన్ చేయించడంతో పాటు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై 'నిర్భయ' కేసు