CM Jagan Launched Jagananna Sampoorna Gruha Hakku Scheme at Tanuku: రాష్ట్రంలోని 52 లక్షల కుటుంబాలకు రూ.1.58 లక్షల కోట్ల ఆస్తిని అందించేందుకే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం చుట్టామని... ఇది ఉగాది వరకు కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మంగళవారం పథకాన్ని సీఎం ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ‘ఇల్లంటే అనేక భావోద్వేగాలకు సజీవ సాక్ష్యం. అలాంటి ఇంటిపై లబ్ధిదారులకు సంపూర్ణ హక్కు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పథకం ప్రవేశపెట్టాం. అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలోనే పేదలకు 31 లక్షల పట్టాలు పంపిణీ చేశాం. వాటిలో ఇప్పటికే 15.6 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాం. ఈ ఇళ్లను పూర్తి చేస్తే ఒక్కో కుటుంబం చేతిలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆస్తి పెట్టినట్లే. ఇప్పటివరకు రాష్ట్రంలో 52 లక్షల మందికి ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు, ఇళ్లలో నివసించే హక్కు మాత్రమే ఉంది. అవసరమైనప్పుడు అమ్మాలన్నా, రుణం పొందాలన్నా, పిల్లలకు కానుకగా ఇవ్వాలన్నా వీలులేదు. దాన్ని మార్చి లబ్ధిదారులకు సర్వహక్కులు కల్పించేందుకు ఓటీఎస్ అమలు చేస్తున్నాం.
8.26 లక్షల మందికి హక్కు పత్రాలు
ఇప్పటి వరకు ఓటీఎస్ చెల్లించిన 8.26 లక్షల మందికి రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలను ఉచితంగా అందిస్తాం. పాదయాత్ర సమయంలో చాలామంది మహిళలు మాకు ప్రభుత్వం ఇళ్లను ఇచ్చినా వాటిపై ఎలాంటి హక్కు లేదని, కనీసం బ్యాంకు రుణం కూడా రావడం లేదని వాపోయారు. దానికి పరిష్కారంగానే ఈ పథకం తీసుకొచ్చాం. ఓటీఎస్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకుంటే కబ్జాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఈ విధానంలో సంపూర్ణ హక్కు పొందితే క్రయవిక్రయాల సమయంలో లింకు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. ప్రజలకు మంచి చేస్తున్నా కొందరు జీర్ణించుకోలేకనే విష ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు రూ.1.16 లక్షల కోట్లను సంక్షేమానికి ఖర్చు చేసిన ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సొంత ఖర్చులతో ఇళ్లు కట్టుకున్న 12 లక్షల కుటుంబాలు కేవలం రూ.10 చొప్పున చెల్లిస్తే చాలు.
రుణం మాఫీ చేస్తాం
రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల మంది గృహ లబ్ధిదారుల్లో 2011 ఆగస్టు 15 వరకు గృహనిర్మాణ సంస్థ దగ్గర తనఖా పెట్టి రుణాలు తీసుకున్న 40 లక్షల మంది లబ్ధిదారులకు అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.14,400 కోట్ల బకాయిలున్నాయి. అందులో రూ.10 వేల కోట్లు రద్దు చేయడమే కాకుండా... దాదాపు రూ.6 వేల కోట్ల రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా మాఫీ చేస్తున్నాం. హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని అసలు, వడ్డీ కట్టలేని వారికి గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.15 వేలు, నగరాల్లో రూ.20 వేలు చెల్లిస్తే సంపూర్ణ హక్కులతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాం. లబ్ధిదారుల స్థిరాస్తి గతంలో నిషేధిత జాబితాలో ఉంటే అందులో నుంచి తొలగించి గ్రామ, వార్డు సచివాలయాల్లోనే నామమాత్రపు రుసుముతో రిజిస్ట్రేషన్ చేయిస్తాం’’ అని ముఖ్యమంత్రి వివరించారు.
అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతోన్న శక్తులు
‘కేవలం నివాస హక్కు మాత్రమే అనుభవిస్తున్న పేదలందరికీ ఒక్కటే విజ్ఞప్తి... పేదలకు మంచి చేస్తున్న ప్రభుత్వ చర్యలను జీర్ణించుకోలేని శక్తులు చాలా ఉన్నాయి. వాళ్లు మీ దగ్గరకొస్తే.. ‘మీకున్నవి.. కొన్నవి.. రేట్లు పెరిగే రిజిష్టరు భూములైనప్పుడు... అలాంటి భూములనే నామమాత్రపు ధరకు ఉచితంగా మాకు రిజిస్ట్రేషన్ చేసిస్తామని ప్రభుత్వం చెబుతోంటే.. మీకెందుకు కడుపు మంట?’’ అని ప్రశ్నించండని ముఖ్యమంత్రి సూచించారు.
* సభ ప్రారంభంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఇద్దరు లబ్ధిదారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ‘ఏ అధికారి చుట్టూ తిరగకుండా.. గడప దాటకుండా.. మా ఇంటికొచ్చిన వాలంటీర్ సాయంతో దగ్గరలోని సచివాలయం ద్వారా రూ.పది లక్షల విలువైన ఆస్తిని సొంతం చేసుకున్నా’ అని కృష్ణాపురానికి చెందిన సుజాత వివరించారు.
* ‘2009లో రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నా హక్కుదారులం కాలేకపోయాం. ఈ పథకం ద్వారా వచ్చే లబ్ధిని తెలుసుకుని సచివాలయంలో రూ.15 వేలు కట్టాను. అయిదు నిమిషాల్లో నా చేతిలో సర్టిఫికెట్ పెట్టారు’ అని శ్రవణ్‌కుమార్ తెలిపారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారుల సమక్షంలో సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా కేకు కోశారు. కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ మోసేనురాజు, ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు, విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పేర్ని నాని, తానేటి వనిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, అధికారులు పాల్గొన్నారు.
ఇంటి నిర్మాణానికి ప్రతి నిరుపేద జీవితకాలం కృషి చేస్తారు. సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతిఫలం ఇల్లు. ఇంటిపై పూర్తిస్థాయి యజమానులుగా మారేందుకు కృషి చేస్తున్నాం. కేవలం రూ.10 చెల్లిస్తే ఇంటిపై సర్వహక్కులు పొందవచ్చు. ఉచితంగా రిజిస్టర్ చేసి డాక్యుమెంట్లు ఇస్తున్నాం. ఇంటిని అమ్ముకునే హక్కును కల్పిస్తున్నాం. ప్రతి పేదవాడికి సొంతింటి కలను సాకారం చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. -జగన్, రాష్ట్ర ముఖ్యమంత్రి
ఇదీ చదవండి..
PM WISHES TO CM JAGAN: సీఎం జగన్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు