CBN FIRES ON CM JAGAN MOHAN REDDY : రాష్ట్రానికి పట్టిన 5ఏళ్ల ఖర్మ పోవాలంటే.. జగన్ అనే సైకో దిగిపోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫొటో ఏంటని ఆయన నిలదీశారు. జగన్ నొక్కే ఉత్తుత్తి బటన్‌లు అవసరం లేదని అన్నారు. బటన్‌లు నొక్కుతున్నానని చెప్పుకుంటూ పేదలను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజలు తిరగబడితే.. జగన్ పారిపోతారని.. హెచ్చరించారు.
ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా.. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో రోడ్‌షో నిర్వహించారు. జగన్ నొక్కే బటన్లతో లారీలకు లారీల అక్రమ డబ్బు తాడేపల్లి ప్యాలెస్ చేరుతోందని ఆరోపించారు. కొత్త మద్యం బ్రాండ్లు తెచ్చి డబ్బులు దండిగా దోచుకుంటున్నారని విమర్శించారు. అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడినోట్లో శని అన్నట్లు రాష్ట్ర పాలన ఉందని చంద్రబాబు విమర్శించారు.
"పట్టదారు పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు. ఏది జరిగినా నవ్వుతూనే ఉంటాడు. నా జోలికి వస్తే తోక కత్తిరించి సున్నం పెట్టి ఊరేగిస్తా. నువ్వు ఏం చేశావో, నేను ఏం చేశానో తేల్చుకుందాం. ఎవరూ రాష్ట్రానికి మంచి చేశారో మాట్లాదాం. ఉత్తుత్తి బటన్‌లు అవసరం లేదు. మద్యం, ఇసుక, భూగర్భ ఖనిజాలు అన్ని దోచుకుంటూనే ఉన్నారు"-చంద్రబాబు
రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలివెళ్తున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. జగన్ సభకు రావాలంటే ప్రజలను తరలిస్తున్నారన్న బాబు.. తమ రోడ్‌షోలకు జనం స్వచ్ఛందంగా వస్తున్నారని తెలిపారు. ఇసుక, మద్యం, ఖనిజాలు దోపిడీ చేస్తున్నారని.. పేదలను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. తెదేపా హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను ఇప్పటికీ ఇవ్వలేదని.. 30 లక్షల ఇళ్లు కట్టి ఇస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు.
మద్యపాన నిషేధం విధిస్తానని కమ్మని కబుర్లు చెప్పారన్న బాబు.. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరితే వైసీపీకి ఓట్లు వేశారని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడు అన్న చంద్రబాబు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపితేనే రాష్ట్రానికి విముక్తని హితవు పలికారు.
ఇవీ చదవండి: